షాకింగ్‌ వీడియో : మహిళను కారుతో తొక్కించి.. 

22 Aug, 2018 10:23 IST|Sakshi

టెక్సాస్‌, హ్యూస్టన్‌ : బ్యాంకులో భారీ మొత్తంలో నగదు డ్రా చేసిన ఓ మహిళను వెంబడించి కొందరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో చోటుచేసుకున్న పెనుగులాటలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గత శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. వ్యాపార అవసరాల కోసం 75 వేల డాలర్లలను (దాదాపు 52 లక్షల రూపాయలు) బ్యాంకు నుంచి ఓ మహిళ డ్రా చేశారు. హ్యుస్టన్‌లోని బ్యాంకు నుంచి బయటకు రాగానే దుండగులు ఆమెను వెంబడించడం ప్రారంభించారు. తనకు చెందిన వలేరో గ్యాస్‌ స్టేషన్‌ వద్దకు మహిళ రాగానే, మరో కారులో నుంచి ఓ దుండగుడు దిగి పరుగున  ఆమె దగ్గరకు వచ్చి బ్యాగులాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. 

అయితే మహిళ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో పెనుగులాట చోటుచేసుకుంది. ఇంతలోనే మహిళ భర్త కూడా వచ్చి దుండగుడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో దుండగుడికి, మహిళ భర్త పెనుగులాడుతుండగానే మహిళ అక్కడి నుంచి పక్కకు వెళ్లాలని చూశారు. ఇంతలోనే దుండగులకు చెందిన మరో కారు కూడా అక్కడికి వచ్చింది. అందులో నుంచి దిగిన మరో వ్యక్తి మహిళ, అమె భర్తపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం వారి ముందుభాగంలో నిలిపిన కారును వేగంగా వెనక్కు తీసుకువచ్చి మహిళపైకి ఎక్కించి ముందుకు వెళ్లడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.

చోరీకి పాల్పడిన డేవిడ్‌ మిచెల్‌గానూ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. రెండో నిందితుడిని ట్రావెన్‌ జాన్సన్‌గా పోలీసులు గుర్తించి అతడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మరికొందరి పాత్రపై కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

Read latest World News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు