పాక్‌లో టమాట కేజీ ధర రూ.300

27 Sep, 2017 14:37 IST|Sakshi

లాహోర్‌: మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో టమాట ధరలు ఆకాశాన్ని తాకాయి. కేజీ టమాట సుమారు రూ.300 ధర పలుకుతోంది. భారత్‌-పాక్‌ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పాక్‌ భారత్‌ నుంచి టమాటను దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం పాక్‌ టమాట, ఉల్లిగడ్డ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అయితే ప్రతి ఏటా పాక్‌లో టమాట కొరత ఏర్పడినప్పుడు భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది.

ఇంత దారుణ పరిస్థితి నెలకొన్న ఆ దేశ ఆహార భద్రతా మంత్రి సికిందర్‌ హయత్‌ బోసన్‌ మాత్రం భారత్‌ నుంచి టమాటలను ఎట్టి పరిస్థితుల్లో దిగుమతి చేసుకోమని తేల్చి చేప్పారు. బలూచిస్తాన్‌ నుంచి పంట దిగుబడి రాగానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. లాహోర్‌, పంజాబ్‌ ప్రావిన్స్‌లో కేజీ టమాట ధర రూ.300గా ఉందని డాన్‌ పత్రిక పేర్కొంది. ఇక భారత్‌ నుంచి కూరగాయల దిగుమతి చేసుకోమన్న బోసన్‌ వ్యాఖ్యలను ఆ దేశ నేతలు సమర్ధిస్తున్నారు. ఈ నిర్ణయం ఇక్కడి రైతులకు ఎంతో మేలు చేస్తుందని వాపోతున్నారు. 2016 పఠాన్‌ కోట్‌ దాడి అనంతరం భారత్‌-పాక్‌ల మధ్య ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు