ట్రంప్‌ మార్కు మార్పు..!

15 Sep, 2018 15:16 IST|Sakshi

కొత్త నిబంధనతో వీసా, గ్రీన్‌కార్డు దరఖాస్తుల తిరస్కరణ

దరఖాస్తులో తప్పులు దొర్లినా, జత చేయాల్సిన డాక్యుమెంట్లలో ఏవైనా మర్చిపోయినా లేదా మిస్‌ అయినా అమెరికా వీసా కోసం పెట్టుకున్న దరఖాస్తు, పిటిషన్‌ లేదా విజ్ఞప్తిని (హెచ్‌1బీ సహా) ఆ దేశ అధికారులు ఇప్పుడు తిరస్కరించవచ్చు. వీసా లేదా గ్రీన్‌కార్డు కోసం చేసుకున్న దరఖాస్తులు అసంపూర్తిగా ఉంటే వాటిని సరిచేసుకునేందుకు దరఖాస్తుదారులకు గతంలో ఉన్న అవకాశం ఇప్పుడుండదు. అమెరికాలో చట్టపరంగా శాశ్వత నివాసులుగా (గ్రీన్‌కార్డ్‌పై) ఉండేందుకు, తాత్కాలికంగా అక్కడ నివసిస్తూ ఉద్యోగం (నాన్‌ ఇమిగ్రెంట్‌) చేసే వారు లేదా అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారిపైనా తాజా నిబంధన ప్రభావం పడుతుంది. ఇప్పటిదాకా ప్రతీ ఏడాది దాదాపు 70 లక్షల వరకు ఇలాంటి దరఖాస్తులను అక్కడి అధికారులు పరిష్కరిస్తున్నారు. అయితే  పర్యటనలు, వ్యాపార అవసరాల నిమిత్తం స్వల్పకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిపై కొత్త నిబంధన వల్ల  ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. గత మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ  నిబంధన విధానపరంగా పెద్దమార్పుగానే ఇమిగ్రేషన్‌ లాయర్లు, కార్యకర్తలు, ఈ ప్రభావానికి గురయ్యే వారు భావిస్తున్నారు. కొత్త నిబంధన వల్ల వీసా దరఖాస్తు ప్రక్రియకయ్యే ఖర్చు మరింత  పెరుగుతుందని,  దరఖాస్తు పరిశీలన మామూలు కంటే ఎక్కువ కాలం తీసుకుంటుందనే అభిప్రాయంతో ఉన్నారు. నిబంధనలో తాజా మార్పు వల్ల ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారి దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నట్టుగా తేలితే వారిని స్వదేశాలకు కూడా తిప్పి పంపించే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఒబామా విధానానికి ట్రంప్‌ మార్పులు..
2013లో బరాక్‌ ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన నిబంధన స్థానంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఈ కొత్త మార్పు తీసుకొచ్చింది. వీసా, గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో తప్పులు, జత చేయని పత్రాలున్న అన్ని కేసుల్లో  అభ్యర్థి పనిచేసుకునేందుకు వీలుగా  రిక్వెస్ట్‌ ఫర్‌ ఎవిడెన్స్‌ (ఆర్‌ఎఫ్‌ఈ), నోటీస్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ టు డినై (ఎన్‌ఓఐడీ) జారీ చేసేలా యూఎస్‌సీఐఎస్‌ అధికారులకు ఒబామా ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొత్త నిబంధన ద్వారా  ఆ అవకాశం ఉండదు. విచారణలో ఉన్న స్వాప్నికుల (డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌డీఏసీఏ) కేసులు మినహా కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి అందే అన్ని దరఖాస్తులు, పిటిషన్లు, విజ్ఞప్తులు దీని పరిధిలోకి వస్తాయని అమెరికా పౌరసత్వ, వలససేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) ప్రతినిధి మైఖేల్‌ బార్స్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు