రక్తదాతా సుఖీభవ

14 Jun, 2019 08:53 IST|Sakshi

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

సాక్షి, హైదరాబాద్‌: ఆకలైన వారికి ఆ పూటకు అన్నం లేకపోయినా కొన్ని రోజులు జీవిస్తారు. కానీ రక్తం అవసరమైన వారికి ఆ సమయంలో ఇవ్వకపోతే మాత్రం విలువైన నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అన్ని దానాలకంటే అన్నదానం గొప్పదని గతంలో చెప్పేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని వైద్యులు చెబుతున్నారు. రక్తంలోని వివిధ గ్రూపులను కనుగొన్న నోబెల్‌ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త ల్యాండ్‌స్టైనర్‌ జయంతి సందర్భంగా ఏటా జూన్‌ 14వ తేదీని ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవ ముఖ్యోద్దేశం 'స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నవారికి మనసారా కృతజ్ఞతలు తెలపడం'. అంతేకాదు.. రక్తదానానికి ప్రజలను పోత్సహించడం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అవసరమొచ్చినా సురక్షితంగా సకాలంలో రక్తాన్ని అందించవచ్చు.  

రక్తం అవసరం, దాని గొప్పతనం అది అవసరమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది.  అవసరమైనప్పుడు రక్తసంబంధీకులు సైతం రక్తం ఇవ్వడానికి ముందుకు రాని ఈ రోజుల్లో మేమున్నామంటూ కులం, మతం, ప్రాంత భేదాలు చూడకుండా రక్తదానం చేస్తున్న వారిని రక్తదాతా సుఖీభవ అని ఆశీర్వదిస్తున్నారు. కృత్రిమంగా సృష్టించలేని రక్తం అందుబాటులో లేకపోతే దేవుడు కూడా ప్రాణాలు కాపాడలేడు. ఒకసారి రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలు నిలబడతాయి. అందుకే రక్తదాతలు మనిషి రూపంలో ఉన్న దేవుళ్లు అని బాధితులు చెప్పుకుంటారు. 

రక్తదానానికి అర్హత... 
♦ దాత బరువు 45 కిలోలు ఉండాలి. 
♦ వయస్సు 18 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి. 
♦ దాత నాడి నిమిషానికి 60 నుంచి 100సార్లు కొట్టుకోవాలి. 
♦ రక్తంలో హెచ్‌బీ శాతం 12.5 గ్రాములకు  పైగా ఉండాలి.  

తీసుకునేది 300 మిల్లీ లీటర్లు
ప్రతి మనిషిలో 5 లీటర్ల రక్తం ప్రవహిస్తుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతి  మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. రక్తదానం సమయంంలో ప్రతి వ్యక్తి నుంచి కేవలం 300 మిల్లీ లీటర్ల రక్తం మాత్రమే తీసుకుంటారు. ఆ రక్తం మళ్లీ కొన్ని గంటల్లోనే శరీరంలో తయారవుతుంది. అన్ని పరీక్షలు చేసిన తర్వాతే రక్తం సేకరిస్తారు. సేకరించిన రక్తాన్ని అవసరం మేరకు రోగులకు ఎక్కిస్తారు.

>
మరిన్ని వార్తలు