అత్యంత పెద్ద వయస్కుడు కన్నుమూత

21 Jan, 2019 08:43 IST|Sakshi

టోక్యో : ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడు, జపాన్‌కు చెందిన మసాజో నొనాకా(113) ఆదివారం కన్ను మూశారు. నొనాకాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, సహజ కారణాలతోనే ప్రశాంతంగా చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఉత్తర జపాన్‌లోని హక్కాయిడో దీవిలో ఆయన కుటుంబ సభ్యులు నాలుగు తరాలుగా రెస్టారెంట్‌ వ్యాపారం చేస్తున్నారు.

గతేడాది ఏప్రిల్‌లో గిన్నిస్‌ బుక్‌ నొనాకాను సజీవంగా ఉన్న అత్యంత వృద్ధ పురుషునిగా గుర్తించింది. అప్పుడు ఆయన వయసు 112 ఏళ్ల 259 రోజులు. 1905లో జన్మించిన నొనాకా..తన ఏడుగురు తోబుట్టువులు, భార్య, ముగ్గురు పిల్లల కన్నా ఎక్కువ కాలం జీవించారు. ప్రపంచంలోనే సజీవంగా ఉన్న అతిపెద్ద వయసున్న మనిషిగా రికార్డులకెక్కిన 116 ఏళ్ల కేన్‌ తనాకా(మహిళ) కూడా జపాన్‌కు చెందిన వారే.

మరిన్ని వార్తలు