యాదాద్రి లడ్డూకు డిమాండ్‌

23 Jan, 2018 01:44 IST|Sakshi

తిరుపతి లడ్డూ తర్వాత అధిక ప్రాధాన్యత దీనికే.. 

రోజూ లక్ష లడ్డూల విక్రయం

ఉత్సవాల సమయంలో రెండు మూడు రెట్లు డిమాండ్‌ 

ఆలయానికి అధిక ఆదాయం లడ్డూ ప్రసాదం నుంచే..

సాక్షి, యాదగిరికొండ : యాదాద్రి నర్సన్న లడ్డూ ప్రసాదానికి డిమాండ్‌ పెరుగుతోంది. సాధారణంగా తిరుపతి లడ్డూ అంటే బాగా క్రేజ్‌ ఉంటుంది. అదే తరహాలో తెలంగాణలో మాత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి లడ్డూకు చాలా ప్రాధాన్యత ఉంది. రుచి అమోఘంగా ఉంటుండటంతో ఈ ఆలయానికి వచ్చేవారంతా వీలైనన్ని లడ్డూలు తీసుకెళుతుండటం ఆనవాయితీగా మారింది. ఒక్కోసారి భక్తుల డిమాండ్‌ మేరకు లడ్డూలు సరిపోని పరిస్థితి కూడా ఏర్పడుతోంది. 

పెద్ద లడ్డూ కోసం.. 
యాదాద్రి దేవస్థానంలో పెద్ద లడ్డూ ప్రసాదం కోసం డిమాండ్‌ పెరుగుతోంది. చిన్న లడ్డూలు 100 గ్రాములు, పెద్ద లడ్డూలు 500 గ్రాముల పరిమాణంలో తయారు చేస్తున్నారు. నిత్యం 20 వేల నుంచి 30 వేల వరకు పెద్ద లడ్డూలు, 50 వేల వరకు చిన్న లడ్డూలు విక్రయిస్తున్నారు. ఇక శని ఆదివారాలు, ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీని బట్టి ఈ డిమాండ్‌ రెండు మూడు రెట్లకుపైగా ఉంటుంది. లడ్డూ ప్రసాదానికి డిమాండ్‌ పెరగడంతో రోజూ ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు తయారు చేస్తున్నారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మరికొంత మందిని నియమించారు. కాగా దేవస్థానానికి వచ్చే ఆదాయంలో సగానికిపైగా లడ్డూ ప్రసాదం నుంచే సమకూరుతుందని అధికారులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు