పట్టాలెక్కేందుకు.. టీడీపీ ప్రయత్నాలు!

13 Feb, 2018 13:20 IST|Sakshi

మూడు జిల్లాలకు అధ్యక్షుల నియామకం

నల్లగొండ జిల్లాకు ఎండీ యూసుఫ్‌.. 

సూర్యాపేటకు పెద్దిరెడ్డి రాజా..

యాదాద్రికి బండ్రు శోభారాణి ఎంపిక

నల్లగొండ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌

2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా నియామకాలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వలసలతో చిక్కిశల్యమైన టీడీపీ మళ్లీ గాడిలో పడేందుకు ప్రయత్నిస్తోంది. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేయి తిప్పుకునేందుకు ఎన్నికల టీమ్‌ను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగానే ముందుగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు అధ్యక్షులను, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ని నియమించింది. నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ఎండీ యూసుఫ్, సూర్యాపేటకు పెద్దిరెడ్డి రాజా, యాదాద్రి భువనగిరికి బండ్రు శోభారాణిలను అధ్యక్షులుగా అధినాయకత్వం నియమించింది. నల్లగొండ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ పేరును ప్రకటించింది.  తెలంగాణ టీడీపీ నుంచి కొన్నాళ్లుగా అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు జరిగాయి. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముఖ్య నేతలంతా ఖాళీ అయ్యారు. ఫలితంగా పార్టీ సంస్థాగతంగా కోలుకోలేకుండా అయ్యింది. గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క స్థానాన్ని దక్కించుకోలేకపోయినా ఆశలు సజీవంగా నిలుపుకొని నిలబడింది. 

వరుస కట్టిన సీనియర్లు
కొద్ది నెలలుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల తర్వాత ఒక్కో సీనియర్‌.. పార్టీని వదలడంతో కుదేలైంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే సీనియర్‌ నేత, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన బడుగుల లింగయ్య యాదవ్‌ల వలసలతో మొదలై.. ఆ తర్వాత  పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్న బిల్యానాయక్‌ , గత ఎన్నికల్లో పార్టీనుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి, సీనియర్‌ నేత ఉమామాధవరెడ్డి, సూర్యాపేటనుంచి పటేల్‌ రమేష్‌రెడ్డి తదితరులు పార్టీని వీడారు. మరోవైపు నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న కంచర్ల భూపాల్‌రెడ్డి సైతం రెండునెలల కిందటే పార్టీనుంచి టీఆర్‌ఎస్‌కు వెళ్లిపోయారు. ఈ వరుస పరిణామాల తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ బతికి బట్టకట్టడం అసాధ్యమన్న అభిప్రాయం మెజారిటీ వర్గాల్లో వ్యక్తమైంది. కానీ, ఈ పరిస్థితినుంచి బయటపడి 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి కోలుకునే దిశగా ఆ పార్టీ నాయకత్వం కాయకల్ప చికిత్స మొదలు పెట్టిందని, దీనిలో భాగంగానే మూడు జిల్లాలకు అధ్యక్షులను నియమించిందని, మరికొన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను ప్రకటించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అధ్యక్ష పదవులకు పోటాపోటీ !
గ్రూపు గొడవలకు తావులేకుండా జిల్లా అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేయాలని భావించిన పార్టీ నాయకత్వం పలువిడతలుగా జిల్లా నాయకులతో చర్చలు జరిపింది. నల్లగొండ జిల్లా అధ్యక్షపదవి కోసం యూసుఫ్‌తోపాటు నల్లగొండ నేత మాదగోని శ్రీనివాస్‌గౌడ్, దేవరకొండ నుంచి వెంకట్‌రెడ్డి పోటీ పడ్డారు. సూర్యాపేట కోసం పెద్దిరెడ్డి రాజాతోపాటు కోదాడ ఇన్‌చార్జ్‌ బొల్లం మలయ్య యాదవ్‌ ప్రయత్నించారు. అదే విధంగా యాదాద్రి భువనగిరి అధ్యక్ష పదవి కోసం బండ్రు శోభారాణితో పాటు మునుగోడు నియోజకవర్గానికి చెందిన అయిలయ్య పోటీ పడ్డారు. కాగా, మునుగోడు నియోజకవర్గంలోని రెండు మండలాలే యాదాద్రి భువనగిరి జిల్లాలో కలవడంతో, మెజారిటీ శ్రేణులు ఆయన పేరును వ్యతిరేకించారని సమాచారం. అసెంబ్లీ నియోజకర్గ ఇన్‌చార్జులుగా ఉన్న వారికి అధ్యక్ష పదవులు ఇవ్వొద్దని సంస్థాగతంగా నిర్ణయించడంతో కోదాడ ఇన్‌చార్జ్‌గా ఉన్న బొల్లం మల్లయ్య యాదవ్‌ను పక్కన పెట్టారని తెలిసింది. నల్లగొండ ఇన్‌చార్జ్‌గా నియమిస్తున్నందున మాదగోని శ్రీనివాస్‌ను ఎంపిక చేసుకోలేదని సమాచారం. ఇక, మూడు జిల్లాల్లో సామాజిక సమీకరణ సమతూకం ఉండడానికే నల్లగొండ జిల్లాకు మైనారిటీ నేతను అధ్యక్షుడిగా ఎంచుకున్నారని అభిప్రాయపడుతున్నారు.    

మరిన్ని వార్తలు