సమస్యలు పరిష్కరించరూ...!

30 Jan, 2018 19:47 IST|Sakshi
వినతిపత్రం అందజేస్తున్న ఎరుకలబావి ప్రజలు

ప్రజావాణికి విశేష స్పందన

వినతులు స్వీకరించిన జేసీ

భువనగిరి టౌన్‌ : స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రజలు వచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరారు. రేషన్‌కార్డు, పెన్షన్‌ ఇప్పించాలని వేడుకున్నారు. మరికొందరు  వ్యక్తిగత సమస్యలపై  జాయిం ట్‌ కలెక్టర్‌ జి.రవినాయక్, జిల్లా రెవెన్యూ అధికారి రావుల మహేందర్‌రెడ్డికి వినతులు సమర్పించారు. చౌటుప్పుల్‌ మండలం కేసారం గ్రామానికి చెందిన జె.నరేష్‌ ఎస్సీ కార్పొరేషన్‌ రుణం కోసం తనను ఎంపిక చేశారని, ఇప్పటి వరకు లోను మంజూరు చెయ్యలేదని వినతి పత్రం అందజేశారు.

చౌటుప్పుల్‌ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మర్చాలని, అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్షంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ చౌటుప్పుల్‌ మండల కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో విన్నవించారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణం ఇప్పించాలని కోరుతూ రాజాపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన జెల్ల స్వరూప వినతి పత్రం అందజేశారు. బస్వాపురం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న బీఎన్‌ తిమ్మాపురంలో ఇంటి పన్నులు వసూలు చేయకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ బీఎన్‌ తిమ్మాపురం గ్రామ మాజీ సర్పంచ్‌ రావుల అనురాధనందు విన్నవించారు.  

విలీన ప్రతిపాదన విరమించుకోవాలి  
భువనగిరి మున్సిపాలిటీ విలీనం కోసం ప్రతిపాదించిన గ్రామాల నుంచి గూడూరును మినహాయించాలి. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనే నానుడి మరిచి పట్టణాలను సుందరీకరించుకునేందుకు విలీనం చేయడం సబుకాదు. మున్సిపాలిటీలో మా గ్రామం కలపడం ద్వారా ఉపాధి హామీ పథకం కోల్పోతాము. దీంతో గ్రామంలో ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. తక్షణమే మున్సిపాలిటీలో విలీన ప్రతిపాదన విరమించుకోవాలి. 
– గూడూరు గ్రామప్రజలు 

అన్ని మగ్గాలకు జియో ట్యాగింగ్‌ ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్‌  నంబర్లు ఇస్తుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిజమైన చేనేత కార్మికులు ఇంత వరకు జియో ట్యాగింగ్‌ నంబర్‌ కేటాయించలేదు. కొంత మంది మగ్గం పని చెయ్యని వారికి జియో ట్యాగింగ్‌ నంబర్‌ కేటాయించారు. జియో ట్యాగింగ్‌ లేకపోవడంతో కార్మికులు త్రిఫ్ట్‌ ఫండ్, నూలు యారన్‌ సబ్సిడీ, ముద్ర రుణాలు పొందలేక పోతున్నారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి.                                         
– తెలంగాణ చేనేత కార్మిక సంఘం నాయకులు

మోదుగుకుంటలో ఎలకబావిని చేర్చొద్దు 
ఆత్మకూర్‌(ఎం) మండలంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మోదుగుకుంట గ్రామ పంచాయతీలో ఎలకబావిని చేర్చొద్దు.  మొరిపిరాల గ్రామ పంచాయతీ పరిధిలో యాధావిధిగా ఉంచాలి. ఈ గ్రామమే దగ్గరగా ఉంటుంది. రవాణా సౌకర్యానికి అనువుగా ఉంది. తక్షణమే అధికారులు స్పదించి యాధావిధిగా మొరిపిరాల గ్రామ పంచాయతీలో ఎలకబావిని ఉంచాలి.
– ఎలకబావి గ్రామ ప్రజలు

మరిన్ని వార్తలు