పిల్లల బళ్లో ఎలుకలు పడ్డాయ్

3 Jan, 2018 12:03 IST|Sakshi
పాఠశాలలో పందికొక్కులు, ఎలుకలు ఇసుక తోడేసిన దృశ్యం

నెలరోజులుగా తెరుచుకోని అంగన్‌వాడీ కేంద్రం

పిల్లలకు,గర్భిణులకు అందని పౌష్టికాహారం

తెరిపించి పుణ్యం కట్టుకోవాలని వేడుకోలు

చిన్నారులతో కళకళలాడాల్సిన అంగన్‌వాడీ బడి ఎలుకలు..పందికొక్కులకు ఆవాసమైంది. గ్రామంలోని బాలింతలకు, గర్భిణులకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పట్టింది. ఒకటి రెండు కాదు నెలరోజులుగా బడి తలుపులు తెరుచుకోకపోయినా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది.

కడప కోటిరెడ్డి సర్కిల్‌: నగర శివార్లలోని మోడంమీదపల్లె (పాత కడప) దళితవాడలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపించి పుణ్యం కట్టుకోవాలని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు. నెలరోజులుగా అంగన్వాడీ కేంద్రాన్ని పూర్తిగా తెరవలేదని వారు ఆరోపించారు. బాలింతలకు, గర్భిణులకు, పిల్లలకు నెలకు  రెండు గుడ్లు, బియ్యం, కంది పప్పు మాత్రమే ఇంటికిస్తారన్నారు. పాలు ఎవరికి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. పిల్లలకు అన్నం వండి పెట్టిన పాపాన పోలేదన్నారు. బడి లోపల ఎలుకలు, పంది కొక్కులు, బండల సందులలో ఉన్న  ఇసుకను బయటికి తీస్తున్నా శుభ్రం చేసేవారు కరువయ్యారన్నారు. తాము వెళ్లి ఏదైన విషయం అడిగితే  గొడవ పడి  మీ బుద్ధి పుట్టిన వారికి చెప్పుకోపోండి అని ఆయా, కార్యకర్త చెబుతున్నారని ప్రజలు ఆవేదనతో తెలిపారు. ఈ విషయమై అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. అధికారులు అంగన్‌వాడీ కేంద్రాన్ని తెరిపించి పౌష్టికాహారం అందేలా  చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం
నగర శివార్లలోని మోడంమీదపల్లెలో అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త, ఆయా నెల రోజుల నుంచి స్కూలు  మూసివేసిన విషయం తన దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని  అర్బన్‌ సీడీపీవో అరుణకుమారిని ఆదేశించాం. నివేదిక రాగానే కార్యకర్త, ఆయా పై చర్యలు తీసుకుంటాం. –మమత, జిల్లా ప్రాజెక్టు డైరక్టర్, ఐసీడీఎస్‌. కడప

అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపించండి...
మా గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపిం చాలి. పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అం దించాలనే ఉద్దేశంతో స్కూల్‌ ఏర్పా టు చేస్తే కార్యకర్త, ఆయా అవేమి పట్టించుకోవడం లేదు. గతనెలంతా స్కూలు తెరవలేదు. –సుబ్బలక్షుమ్మ, స్థానికురాలు

నెలకు రెండు గుడ్లే....
 బాలింతలకు, గర్భిణులకు రెండు గుడ్లు మాత్రమే ఇస్తారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం ఇదేనా? స్కూలులో ఏమేమి ఇస్తారో  మెను కూడా లేదు. ఇంత అధ్వానంగా ఆయా, కార్యకర్త వ్యవహరిస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్లు.–బేబి, స్థానికురాలు

మరిన్ని వార్తలు