మరుగు కరువు!

1 Feb, 2018 10:39 IST|Sakshi
బహిరంగ మల మూత్ర విసర్జన చిత్రం (ఫైల్)

కలెక్టరు సారూ... మా పట్టణాన్ని పట్టించుకోండి...!

రాయచోటిలో కనిపించని మరుగుదొడ్లు

ఇబ్బందులు పడుతున్న మహిళలు

బహిరంగ విసర్జనలతో కంపుకొడుతున్న పట్టణం  

రాయచోటి: బహిరంగ మల మూత్ర విసర్జన లేకుండా చేయడానికి అటు ప్రభుత్వం, ఇటు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఆ సంకల్పం రాయచోటి పట్టణంలో అభాసుపాలవుతోంది. 2005లో పంచాయతీ స్థాయి నుంచి పురపాలక సంఘంగా మార్పు చెందింది. ఈ పట్టణాన్ని 2012లో జాతీయస్థాయిలో మురికివాడలు లేని పురపాలికగా ఎంపిక చేశారు. ఈ విషయం చెప్పుకోవడానికి బాగున్నా పట్టణంలో మల, మూత్ర విసర్జన చేసుకోవడానికి ఒక్క మరుగుదొడ్డి లేదంటే అతిశయోక్తి కాదు. పేరుకు బస్టాండు సమీపంలోని గాలివీడు మార్గంలో ఒక చోట ఉన్నా సిబ్బంది చేతివాటం కారణంగా వాటిని వేరే అవసరాలకు ఉపయోగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో అక్కడ మరుగుదొడ్లు ఉన్నా అవి ఎవ్వరికి కనిపించ వు కాబట్టి లేనేట్లే . అవసరాల రీత్యా నిత్యం పరిసర మండలాలు, గ్రామా ల నుంచి వేల సంఖ్యలో ప్రజలు రాయచోటి పట్టణానికి వచ్చి వెళుతుంటా రు. పట్టణ జనాభా లక్షకు పైమాటే. రెండు గంటల పాటు గడిపే సినిమా హాళ్లల్లో మరుగుదొడ్లు ఉంటాయి. ప్రతి పనికి, వస్తువుకు ట్యాక్స్‌ రూపంలో వసూలు చేస్తున్న మున్సిపాలిటీలో మాత్రం మరుగుదొడ్లను ఏర్పాటు చేయకపోవడం దారుణం. ప్రజలు తమ ఇంట్లో మరుగుదొడ్డి కట్టకపోతే ఇంటి ముందు ధర్నా చేస్తామనే జిల్లా అధికారులకు ఈ వ్యవహారం కనపడలేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేయలేని ఈ పనిని ఎక్కడబడితే అక్కడ కానిచ్చేస్తున్నా రు. ముఖ్యంగా మహిళ పరిస్థితి వర్ణణా తీతం. వస్తువుల కొనుగోళ్లు, విక్రయాల కోసం వచ్చే మహిళలకు మరుగుదొడ్లు కని పించవు. కొన్ని సమయాల్లో మహిళలు తట్టుకోలేక చిన్నపాటి సందు, గొందులను ఆసరాగా చేసుకుని బహిరంగంగా ఉపయోగించుకుంటూ తమ ఆత్మాభిమానాన్ని చంపుకుంటున్నారు. పురుషులైతే పట్టణ పరిధిలో ఉన్న చిన్నపాటి చాటు కనిపించినా బహిరంగ మూత్ర విసర్జనను చేస్తుంటారు. దీంతో పట్టణంలోని రద్దీ ప్రాంతాలైన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణం, జూనియర్‌ కళాశాల, డైట్‌ ప్రాంగణం, నేతాజీ సర్కిల్, గున్నికుంట్ల రోడ్డు, రవి థియేటర్, ఠాణా, మార్కెట్, గాంధీ బజారు లాంటి చాలా ప్రాంతాల్లో బహిరంగ మూత్ర విసర్జన కారణంగా ఆ ప్రాంతాలన్నీ అత్యంత దుర్గంధ భరితంగా తయారవుతున్నాయి. వీటి వల న అనేక వ్యాధుల వ్యాప్తికి బహిరంగ మూ త్ర విసర్జనే కారణమవుతోంది. ఇలాగే కొనసాగితే రాయచోటి మొత్తం మురికివాడగా తయారయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణంగా తయారు చేయడానికి అవసరమైన మరుగుదొడ్లను నిర్మించాల్సిన అవసరం ఉంది.

వ్యాధులతో భయమేస్తోంది
రద్దీ ప్రదేశంలో సినిమా థియేటర్‌ ఉంది. ప్రతిరోజు వందల సంఖ్యలో మూత్ర విసర్జనకు లోనికి వచ్చేస్తున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా తయారవడంతో పాటు అనేక వ్యాధులు సైతం వ్యాపిస్తున్నాయి. వీరిని వారించడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. అయినా మానవతా దృక్పథంతో దీనిని భరించాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ప్రజలకు ఉపయోగపడేలా మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి బాగుంటుంది. –జి.కలీమ్, సోనిరాజ్‌ థియేటర్‌ యజమాని

నిర్మాణానికి నిధులున్నా నిర్మించలేకపోతున్నాం
పట్టణంలో మరుగుదొడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే. మరుగుదొడ్ల నిర్మాణానికి ఏడాది కింద ట నిధులు మంజూరయ్యాయి. ని ర్మించడంలో ఆలస్యం చోటు చేసుకొంటోంది. త్వరలోనే ఠాణా, గాం« దీ బజారులలో నిర్మించే ప్రయత్నాలు చేస్తాం. గాలివీడు మార్గంలో ఉన్న మరుగుదొడ్డిని వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం.–ప్రసాద్‌రాజు, కమిషనర్‌

మరిన్ని వార్తలు