జయరాములు, ఆదిలకు మొండి చేయి

9 Mar, 2019 12:21 IST|Sakshi

టీడీపీ అధినేత యూజ్‌ అండ్‌ త్రో పాలసీకి బలి

సాక్షి ప్రతినిధి కడప: అధికారపార్టీ ప్రోత్సాహంతో జిల్లాలో బద్వేల్, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు జయరాములు, ఆదినారాయణరెడ్డిలు గతంలో పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారు. ఫ్యాన్‌ గుర్తుపై గెలిచిన వారు టీడీపీ సైకిల్‌ ఎక్కారు. ఆపై వారిచేత ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వంపై విమర్శల దాడి చేయించారు. నిస్సిగ్గుగా ఫిరాయింపులకు పాల్పడి  నైతికతను  విస్మరించి ఆదరించిన పార్టీకి ద్రోహం తలపెట్టారు.  యూజ్‌ అండ్‌ త్రో పాలసీ బాగా వంటబట్టిన టీడీపీ అధినేత ఇప్పుడు వారిని దూరం పెడుతున్నారు. దీంతో వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా ఉత్పన్నమైంది.ఇంటికూడు...దోవ కూడు  లేకుండా పోతున్న పరిస్థితితలెత్తింది.


పరిగణలోనే లేని జయరాములు....
బద్వేల్‌ ఎమ్మెల్యే జయరాములు పేరును పరిగణలోకి తీసుకోకుండానే టీడీడీ అధినేత  అభ్యర్థిత్వాల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి విజయం సాధించినా 2019లో నాటికి ఆయన్ను డమ్మీగా మార్చేశారు. జయరాములు టీడీపీలో చేరాక బద్వేల్‌ ఇన్‌ఛార్జి మాజీ ఎమ్మెల్యే విజయమ్మతో సఖ్యత లోపించింది.  తనతో తలపడి ఓటమిచెందిన ఎన్‌డీ విజయజ్యోతితో జట్టుకట్టారు. ఇరువురు కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు.  విజయమ్మతో నిమిత్తం లేకుండా ఇరువురిలో ఒకరికి టికెట్‌ కేటాయించాలని వారు సంయుక్తంగా కోరారు. దాంతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఈ ఇద్దరిపై వ్యతిరేకత పెంచుకున్నారు. ఇరువుర్నీ సమానదూరంలో పెట్టినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఎంపిక జయరాములు పేరు కనీసం పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకూ విజయజ్యోతి, లాజరస్, డాక్టర్‌ రాజశేఖర్‌ పేర్లను పరిశీలించారు. విజయజ్యోతికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆశీస్సులు లేవు. డాక్టర్‌ రాజశేఖర్, లాజరస్‌లను మాజీ ఎమ్మెల్యే ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. విజయజ్యోతికి  విజయమ్మ ఆశీస్సులు లేకుండా టికెట్‌ ఇవ్వడం కష్టమని తేల్చి చెప్పినట్లు సమాచారం. 
 

గుడ్డిలో మెల్లలా మంత్రి ఆది....
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్లు కేటాయించేందుకు చంద్రబాబు నిరాకరించారు. మరో ఫిరాయింపు ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు అభ్యర్థిత్వం ఆశించి భంగపడ్డారు. కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. 1989 నుంచి ఇప్పటివరకూ వరుసగా టీడీపీ ఓటమి చవిచూస్తోంది. కడప ఎంపీగా వైఎస్‌ కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఓడిపోయే సీటును ఫిరాయింపు ఎమ్మెల్యేగా చరిత్రకెక్కిన ఆదినారాయణరెడ్డిని ఎంపిక చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే మంత్రి ఆదిని రాజకీయంగా బలి చేయడమేనని విశ్లేషకులంటున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థిత్వం దక్కిందనే చెప్పుకోవడం మినహా ఆదిలో నిస్సత్తువ ఆవహించిందని తెలిసింది. సొంత పార్టీలో కాలర్‌ ఎరగేసుకొని సహచర ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన హీన చరిత్ర మూటగట్టుకున్న ఇద్దరూ ఇప్పుడు చంద్రబాబు వంచనతో రాజకీయంగా బలవుతున్న దుస్థితి నెలకొంది. 

మరిన్ని వార్తలు