ఉక్కుపై గళమెత్తిన అఖిలపక్షం

21 Jan, 2018 07:09 IST|Sakshi

ఉక్కు పరిశ్రమ సాధనకు 25న బంద్‌

విజయవంతం చేయాలని అఖిలపక్ష నేతల పిలుపు

ర్యాలీలు, ప్రదర్శనలతో ప్రజలకు అవగాహన

కడప కార్పొరేషన్‌ : విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఈనెల 25న నిర్వహించే బంద్‌ను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం స్థానిక వైఎస్‌ఆర్‌ స్మారక ప్రెస్‌క్లబ్‌లో ‘ఉక్కు సాధన ఐక్యవేదిక’ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఐక్యవేదిక అధ్యక్షులు బి. నారాయణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమకు కావలసిన అన్ని రకాల ఖనిజాలు జిల్లాలో ఉన్నాయన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగాలంటే ఉక్కు పరిశ్రమ కావాలని దివంగత వైఎస్‌ఆర్‌ బ్రహ్మణి స్టీల్‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయిందన్నారు.  

సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు ఉలుకూపలుకూ లేకుండా ఉందని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంటులో ఒత్తిడి తెచ్చినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారని చెప్పారు. మేధావి సమాఖ్య అధ్యక్షులు ఎం. వివేకానందరెడ్డి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధన కోసం గవర్నర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానిని కలవాలని సూచించారు. న్యాయవాదుల తరుపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు మస్తాన్‌వలీ తెలిపారు. ప్రైవేటు స్కూల్స్‌ కరస్పాండెంట్ల సంఘం నాయకులు జోగిరామిరెడ్డి, ఇలియాస్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బండి జకరయ్య, అవ్వారు మల్లికార్జున, దేవగుడి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, కిషోర్‌కుమార్, సీఆర్‌వీ ప్రసాద్, బీఎస్పీ అధ్యక్షుడు సగిలి గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి సంఘాలు చొరవ తీసుకోవాలి
ఈనెల 25న బంద్‌కు సంబంధించి ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించాలని ఉక్కు సాధన ఐక్యవేదిక అధ్యక్షులు బి. నారాయణ అన్నారు. ఈ మేరకు విద్యార్థి సంఘాలు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతిరోజూ రెండు గంటల పాటు వీధుల్లో ప్రదర్శనలు చేయాలని తెలిపారు. ముందే విద్యాసంస్థలను మూసేయకుండా, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వచ్చిన తర్వాత బంద్‌లో పాల్గొనే విధంగా చేయాలని సూచించారు.

మద్దతు ఉపసంహరించవచ్చు కదా!
కడపలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు కమిటీలు వేయడం కాలయాపన చేసేందుకేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. కేంద్రం సాయం చేయకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని సీఎం చెప్పడం సరికాదని, ఎన్‌డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తే సరిపోతుందన్నారు.

రాజధానిని కోల్పోయినప్పుడే అస్థిత్వం కోల్పోయాం–సీహెచ్‌
రాయలసీమ ప్రజలు రాజధానిని కోల్పోయినప్పుడే అస్థిత్వం కోల్పోయారని రాయలసీమ, కార్మిక, కర్షక సమితి అధ్యక్షులు సీహెచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బంద్‌ ఎందుకు నిర్వహిస్తున్నది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలని, ఎన్‌జీఓ నాయకులను కలసి ప్రభుత్వ కార్యాలయాలు మూయించాలన్నారు.

ఓటుకు కోట్లు కేసువల్లే గట్టిగా నిలదీయలేని పరిస్థితి– ఎమ్మెల్యే
ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినందువల్లే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదని కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా ఆరోపించారు. రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి తీరాలన్నారు. ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా కడప ఉక్కు పరిశ్రమ గూర్చి కేంద్రాన్ని అడగకపోవడం  దారుణమని తెలిపారు.

మరిన్ని వార్తలు