ఖల్‌ 'నాయక్స్' ‌..

18 Jan, 2018 04:03 IST|Sakshi

ప్రొద్దుటూరు క్రైం : నేరాలను అరికట్టాల్సిన, శాంతి భద్రతలను కాపాడాల్సిన రక్షక భటులే స్టేషన్‌లో మద్యం తాగి కొట్టుకుంటే ఏ శిక్ష విధించాలి.. ఇద్దరు కానిస్టేబుళ్లు బాహాబాహీ తలబడ్డ సంఘటన ప్రొద్దుటూరులోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది.    కేకలు వేస్తూ వారి మధ్య ముష్టి యుద్ధం జరగడంతో దారిన వెళ్లే స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. ఒకానొక దశలో ఎస్‌ఐలు సర్దిచెప్పినా వారు వినిపించుకోలేదు. సుమారు 30 నిమిషాల పాటు వారి కేకలు, తిట్లతో స్టేషన్‌ పరిసరాలు మారుమోగిపోయాయి.

 స్టేషన్‌లో ఇద్దరు ఎస్‌ఐలు ఉన్నప్పుడే ఈ సంఘటన జరగడం విశేషం. విశ్వసనీయ వర్గాలు తెలిపిన మేరకు దీనికి సంబం«ధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్టేషన్‌లో చంద్రానాయక్, వెంకటేశ్వర్లు నాయక్‌ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు. చంద్రానాయక్‌  ముఖ్యమైన కేసుల్లోని నిందితులను పట్టుకొని రావడం, చోరీ సొత్తు రికవరీ చేయడం చేస్తుంటాడు. ఈ కారణం చేతనే అతను   అధికారులతో చాలా దగ్గరగా ఉంటాడని సిబ్బంది అంటున్నారు. దీంతో తమను లెక్కచేయడని హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు వాపోతున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడకున్నా పలువురిని డబ్బు ఇమ్మని వేధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అందరూ ఉండగానే...
మంగళవారం మధ్యాహ్నం అందరూ స్టేషన్‌లో ఉండగా చంద్రానాయక్, వెంకటేశ్వర్లు నాయక్‌ గొడవ పడినట్లు తెలిసింది. వీళ్లిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని స్టేషన్‌ సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘర్షణలో వెంకటేశ్వర్లు నాయక్‌కు స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి. డబ్బు పంపకాల్లో తేడా రావడంతో గొడవ జరిగినట్లు కొందరు చెప్పగా, ఇంకొందరేమో ఇద్దరూ వరుసకు మామా అల్లుళ్లు కావడంతోనే తమాషాగా తిట్టుకున్నారని అంటున్నారు. 

ఈ సంఘటనపై స్టేషన్‌ అధికారులు ఎస్పీకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. మద్యం సేవించి స్టేషన్‌కు రావడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. ఇన్ని రోజులు సివిల్‌ డ్రస్‌లో ఉన్న చాంద్రానాయక్‌ అధికారుల ఆదేశాల మేరకు యూనిఫాంతో  వచ్చాడు. ఇకపై స్టేషన్‌లోనే ఉంటూ విధులు నిర్వర్తించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.  స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు నివేదిక పంపినట్లు తెలుస్తోంది.

మనస్పర్థల వల్లనే..
కానిస్టేబుళ్లు ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వారని వన్‌టౌన్‌ సీఐ వెంకటశివారెడ్డి తెలిపారు. వారి గ్రామంలో ఉన్న మనస్పర్థల వల్ల స్టేషన్‌లో గొడవ పడ్డారన్నారు. ఇద్దరి మధ్య తోపులాట జరిగే క్రమంలో ఒక కానిస్టేబుల్‌కు బొటన వేలికి గాయం అయిందని, ఇద్దరిని మందలించినట్లు సీఐ వివరణ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు