తవ్వినకొద్దీ ప్రశ్నలు

4 Jul, 2013 16:46 IST|Sakshi
తవ్వినకొద్దీ ప్రశ్నలు
సంపాదకీయం
 సెప్టెంబర్ 10, 2009  
 
 ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డినీ, మరో నలుగురినీ అన్యాయంగా బలిగొన్న మృత్యుదూత వంటి ఆ హెలికాప్టర్ ప్రయాణయోగ్యతపై, అందులో ఉండవలసిన పరికరాలు లేకపోవడంపై, మానవ నిర్లక్ష్యాలపై కుప్పలు తెప్పలుగా వస్తున్న కథనాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి వంటి అతిముఖ్యవ్యక్తి హెలికాప్టర్ ప్రయాణానికి ఎంతో సుసూక్ష్మస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందన్న స్పృహ ఏ స్థాయిలోనూ లేనట్టు చెబుతున్న ఈ కథనాలు ఆశ్చర్యంతో పాటు ఆవేదననూ ముంచెత్తుతున్నాయి. సమగ్ర దర్యాప్తు  జరిగి నిజానిజాలు నిగ్గుతేలేవరకు వీటిలో కొన్ని ప్రస్తుతానికి అనుమానాలు మాత్రమే కావచ్చు. కానీ, అన్నీ అటువంటివి కావు.
 
 ఉదాహరణకు, ప్రమాద పరిస్థితులలో హెలికాప్టర్ ఉనికిని గుర్తించడానికి తోడ్పడే ఈఎల్టీ (ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్‌మిటర్) అనే పరికరం విషయంలో బాధ్యతాయుత స్పందనను కనబరచి ఉంటే, నల్లమల అడవుల్లో కూలిన ఆ హెలికాప్టర్ ఆచూకి తక్షణమే లభించి ఉండేది. అందులో ఈఎల్టీ ఉన్నప్పటికీ దాని ఫ్రీక్వెన్సీ తక్కువనీ, దానికంటె ఎక్కువ ప్రీక్వెన్సీ (406 మెగాహెడ్జ్) ఉన్న ఈఎల్టీలను వినియోగించాలని అంతర్జాతీయస్థాయిలో నిర్ణయం తీసుకుని, దానిని ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచే అమలు చేస్తున్నారనీ సమాచారం. ‘ఇస్రో’ ఉపగ్రహాలు ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఈఎల్టీ నుంచి మాత్రమే సంకేతాలు స్వీకరించగలవు కనుక అన్ని విమానాలలో, హెలికాప్టర్లలో దానిని అమర్చుకోవాలని అంతరిక్ష విభాగం సూచించింది. రాష్ట్రపౌరవిమానయానసంస్థకు అసలీ మార్పు తెలుసునా, తెలియదా; తెలిసినా పట్టించు కోలేదా అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఫ్రీక్వెన్సీని పెంచిన ఈ పరికరం ఖర్చు తక్కువ, సామర్థ్యం ఎక్కువా అంటున్నారు. దీనికి సంబంధించిన మొత్తం పరిజ్ఞానాన్ని గత ఏడాది ఆగస్టు నాటికే అందించారు. 
 
 కూలిన హెలికాప్టర్‌లో ఉన్నది పాత ఈఎల్టీయేనని రాష్ట్ర పౌరవిమానయాన సంస్థ అంగీకరించింది కూడా. ఇన్ని రోజులుగా నిర్లక్ష్యపు ముసుగుతన్ని గాఢ నిద్ర చిత్తగించిన సంగతి దీనితో స్పష్టం కావడం లేదా? ఒక చిన్న నిర్లక్ష్యానికి ఎంత భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందో చూడనే చూశాం. పైగా విమానయాన సంస్థలు తమ వద్దనున్న ఈఎల్టీలను భారత అంతరిక్ష విభాగానికి చెందిన ఇండియన్ మిషన్‌లో రిజిష్టర్ చేయించుకోవలసి ఉన్నా, ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లోని ఈఎల్టీని చేయించలేదట. ఇటువంటి ప్రయోజనమే ఉన్న పర్సనల్ లొకేటర్ బీకన్(పీఎల్‌బీ) అనే, కేవలం రూ. 20 వేల ఖరీదు చేసే పరికరాన్ని హెలికాప్టర్‌లో అమర్చుకుంటే మంచిదన్న హితబోధ కూడా పౌరవిమానయానశాఖకు చెవికెక్కలేదు. చివరికి, చెన్నైలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో అనుసంధానం కాగలిగిన రేడియో వ్యవస్థ కూడా ఈ బెల్-430 హెలికాప్టర్‌లో లేదంటున్నారు. ఎనిమిది కోట్ల జనాభా భవిష్యత్తును శాసించే ఒక ముఖ్యమంత్రి ప్రయాణించే హెలికాప్టర్ విషయంలో ఈ అజాగ్రత్తను ఎలా క్షమించగలం?
 
 మానవ వైఫల్యాల గురించిన కథనాలు, కుంగదీసే మరో కోణం. వైఎస్ పర్యటన దృష్ట్యా పౌరవిమానయానశాఖ కొన్ని రోజుల ముందే వాతావరణ పరిస్థితులు, అధికవర్షాల గురించి   చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను ముందే హెచ్చరించిందనీ, అయినా వారు సకాలంలో స్పందించలేకపోయారనీ ఒక కథనం. అలాగే, మరణించిన పైలట్ ఎస్‌కే భాటియా పాత్రపైనా ప్రతికూల సమాచారం వెల్లడవుతోంది. హెలికాప్టర్ బయలుదేరేముందు వాతావరణం గురించి ఆరా తీసిన అధికారులకు నిర్లక్ష్యంగా జవాబిచ్చారట. ఆయన డిప్యుటేషన్ గడువు జూన్ 3వ తేదీతోనే ముగిసినా, భారత వైమానిక దళం పొడిగింపు విజ్ఞప్తిని తిరస్కరించినా ఆయన విధులలో కొనసాగుతుండడం అవ్యవస్థకు మరో నిదర్శనం. గతంలో కూడా ఒకసారి వైఎస్ ప్రయాణిస్తున్నప్పుడు ఇబ్బందికర పరిస్థితిని సృష్టించి మెమో అందు కున్నారట. హెలికాప్టర్ నడపడానికి ముందు నిబంధనల ప్రకారం చేయించుకోవలసిన వైద్య పరీక్షలకు ఆయన ససేమిరా అనడం, బౌద్ధమత గురువు దలైలామాను ఆయన తీసుకు వెడుతున్నప్పుడు హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడం వంటి ఉదంతాలను కూడా ఉదహరిస్తున్నారు. ఆయన తరచూ ప్రయాణ పరిధులను అతిక్రమిస్తుంటారని, ఆ మేరకు పౌర విమానయాన శాఖకు ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నాయనీ అంటున్నారు. ముఖ్యమంత్రి ప్రయాణం విషయంలో పాటించే భద్రతా ప్రమాణాలు అడుగడుగునా పేలవంగానే ఉన్నాయన్న గట్టి అభిప్రాయానికే ఇవన్నీ తావిస్తున్నాయి.
 
 గగనమార్గంలో ముఖ్యమంత్రి భద్రతకు బాధ్యత పౌరవిమానయానశాఖదే తప్ప తమది కాదని పోలీస్ ఉన్నతాధికారులనడం మరో విచిత్రం. నాలుగు విభాగాలు నాలుగు ముఖాలుగా జరుపుతున్న దర్యాప్తులో ప్రమాద కారణాలు తేటతెల్లం కావచ్చు. తర్వాత కూడా పాఠాలు నేర్చుకుంటారా అన్నది ఎప్పటిలా శేషప్రశ్న. ఏమి జరిగితే మాత్రం ముఖ్యమంత్రీ, మరి నలుగురూ ప్రాణాలతో తిరిగొస్తారా అన్నది గుండెల్ని పిండి చేసే మరో ప్రశ్న.
 

 

మరిన్ని వార్తలు