మేమేమి చేశాము పాపం..!

12 Jan, 2018 10:29 IST|Sakshi

కన్నబిడ్డలను వదిలించుకుంటున్న తల్లులు

జిల్లాలో పెరుగుతున్న సంఘటనలు

1. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కడప శిశుగృహకు చేరిన పాప(ఫైల్‌)

2. కడప నగరంలో మురికి కాలువలో పడేసిన పసిపాప(ఫైల్‌)

3. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పసిపాప(ఫైల్‌)

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : తల్లి ఎవరో తెలియదు...కానీ ఈ చిన్నారుల బతుకులు చిదిమేస్తున్నారు. పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డలు ముళ్లపొదల్లో, మురికి కాలువల్లో దర్శనమిస్తున్నారు. అభం..శుభం ఎరుగని పసికందులను పాశవికంగా పడేస్తుండటంతో కుక్కలు.. పందులకు ఆహారంగా మారుతున్నారు. ఇలాంటి హృదయ విదారక సంఘటనలు ఇటీవల కాలంలో జిల్లాలో ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏమైపోతోంది మానవత.. ఎటు పోతోంది సమాజం అంటూ మానవతావాదులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 17వ తేదీన దేవుని కడప వద్ద, అక్టోబరు నెల 27వ తేదీ సిద్దవటం మండలం నేకనాపురం గ్రామంలోను, ఈనెల 7వ తేదీన కడప నగరం బీకేఎం వీ«ధిలో బొడ్డు కూడా ఊడని చిన్నారిని మురికి కాలువలో పడేశారు. 9వ తేదీన రాయచోటిలో ఓ తల్లి బిడ్డను వదిలించుకునే ప్రయత్నం చేయగా ఐసీడీఎస్‌ సీడీపీఓ వసంతబాయి, కడప శిశుగృహ మేనేజర్‌ కుమారి వెళ్లి పాపను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

నవమాసాలు మోసిన కన్న తల్లులు ఆ పసిబిడ్డను చిదిమి వేయాలని చూడటం వెనుక రకరకాల కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. పేదరికం కారణంగా కొందరు.. ఆడ పిల్ల పుట్టిందని మరికొందరు.. వివాహం కాకముందే జన్మనిచ్చినందుకు ఇంకొందరు.. ఇలా కారణాలు ఏమైనా చిన్నారుల జీవితాలు మాత్రం అర్థంతరంగా ఆగిపోతున్నాయి. ఆ పిల్లలకే మాటలొస్తే ‘అమ్మా..  నేను కడుపులో పడ్డానని తెలిసి మురిసిపోయాను. నెలలు నిండే కొద్దీ ఎన్నో కలలు కన్నాను. నన్ను నవమాసాలు మోసి.. పురిటినొప్పులు అనుభవించి జన్మనిచ్చావు. మరి ఎందుకమ్మా నన్ను ఈ ముళ్ల పొదల్లో పడేశావ్‌.. నన్నెందుకమ్మా వదిలించుకుందామనుకున్నావ్‌.. నీకు ఏ కష్టమొచ్చిందమ్మా..  నన్ను అనాథను చేయడం నీకు భావ్యమా అమ్మా.. అని ప్రశ్నించక మానరేమో.. ఇలాంటి సంఘటనలపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టకపోతే సమాజంలో జవాబుదారీ తనం లేకుండా పోతుందని పలువురు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు