ఏదీ ఆహ్వానం..?

3 Jan, 2018 11:20 IST|Sakshi

జిల్లా ప్రథమ పౌరుడికిదేనా గౌరవం

దళితుడినని అధికారులకు చిన్నచూపా?

జన్మభూమి కార్యక్రమానికి అందని ఆహ్వానం

అగ్రవర్ణాలకు చెందిన వారైతే ఇలాగే చేస్తారా అంటూ జెడ్పీ చైర్మన్‌ గూడూరు రవి ప్రశ్న

కడప ఎడ్యుకేషన్‌: జిల్లా ప్రథమ పౌరుడు, క్యాబినెట్‌ ర్యాంకు హోదా కలిగిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌కు జిల్లాలో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా పిలుపులేకుండా పోతోంది. తాజాగా జిల్లాలో జరుగుతున్న జన్మభూమితో పాటు నేడు పులివెందులకు వస్తున్న సీఎం సభకు కూడా ఆహ్వానం అందలేదు. కనీసం ప్రోటోకాల్‌ కోసమైనా ఆహ్వాన పత్రికలను పంపాల్సి ఉన్నా దాని గురించి పట్టించుకునే వారే లేరు.

ఇటీవల ఉపరాష్ట్రపతి కార్యక్రమానికి కూడా..
ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన ఓ పాఠశాల ఉత్సవాల కార్యక్రమానికి  ఉపరాష్ట్రపతి వచ్చారు. ఈయన కార్యక్రమానికి కూడా జెడ్పీ చైర్మన్‌కు పిలుపులేదు.  
∙గతంలో జిల్లా పరిషత్తు కార్యాలయ ఆవరణంలో నిర్మించిన డీఆర్సీ భవన్‌ శంకుస్థాపనకు మంత్రి గంటా వచ్చారు. ఆ రోజు కూడా ఆహ్వానం లేదు. మంత్రి వచ్చే ముందు ఫార్మాలిటీకి ఆధికారులు వచ్చి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. దీంతో జెడ్పీ చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమ కార్యాలయం ఆవరణంలో  కార్యక్రమం జరుగుతున్నా ఆహ్వానం లేకపోవడంపై మండిపడ్టారు.   జెడ్పీ చైర్మన్‌ దళితుడని అధికారులకు చిన్నచూపేమోనని పలు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అడుగడుగునా అవమానం
తాను దళితుడినని జిల్లా అధికారులు అడుగడుగునా అవమానానికి గురి చేస్తున్నారని జెడ్పీ చైర్మన్‌ గూడూరు రవి సాక్షితో ఆవేదన వ్యక్తం చేశారు.  ఇదే చైర్మన్‌ పదవిలో అగ్రవర్ణాలకు చెందిన వారు ఉండి ఉంటే ఇలా చేశేవారా అని ప్రశ్నించారు. జిల్లాలో ఏ అధికారిక కార్యక్రమం జరి గినా కనీసం ఆహ్వాన పత్రికను కూడా పంపరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందంతా జిల్లా అధికారులే చేస్తున్నారా లేక అ«ధికార పార్టీవారు చెప్పి చేయిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు.

మరిన్ని వార్తలు