లక్ష్యం సాధ్యమా!

22 Jan, 2018 09:39 IST|Sakshi

సమీపిస్తున్న గడువు

అడుగడుగునా అడ్డంకులు

నత్తనడకన మరుగుదొడ్ల నిర్మాణాలు

కడప : వైఎస్సార్‌జిల్లాను 2018 మార్చి నాటికి  స్వచ్ఛజిల్లాగా ప్రకటించాలన్న  ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు అధికారులు ఆపసోపాలు పడక తప్పడం లేదు. కలెక్టర్‌ నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకు ప్రతి ఒక్కరూ నడుంబిగించి  కృషి చేస్తున్నారు. ఈనెలాఖరుకల్లా  వైఎస్సార్‌జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లా(ఓడీఎఫ్‌)గా  ప్రకటించాలని సీఎం అధికారులను అదేశించారు. కేవలం పదిరోజులు మాత్రమే గడువు ఉంది. ఈలోగా పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించగలగాలి. అ దిశగా అధికారులు కృషి చేస్తున్నా కింది స్థాయిలో అది సాధ్యం అవుతుందా అన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారణం 3వేల మరుగుదొడ్లకు సంబంధించి హార్డ్‌కోర్‌ కింద ( పలు కారణాల చేత ఆగిపోయినవి, ఉదాహరణకు గట్టి నేల ఉండటం, ఇంటిలో గర్భిణులు,బాలింతలు ఉండటం, ఇంటి పెద్దలు చనిపోవడం వంటి వి) పనులు అగిపోయాయి. 

అడుగడుగునా అడ్డంకులే
జిల్లాలో స్వచ్చ భారత్‌ మిషన్‌ పథకాన్ని  2014లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అప్పట్లో  జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించి  3,04, 992 మరుగుదొడ్లు అవసరమని గుర్తించారు. పథకం ప్రారంభంలో లబ్థిదారులకు బిల్లుల చెల్లింపు సరిగా లేదు. ఫలితంగా మరుగుదొడ్ల నిర్మాణానికి చాలామంది ఆసక్తి చూపలేదు.దీంతో పథకం లక్ష్యం కుంటుపడుతూ వచ్చింది.   గ్రామీణ ప్రజలకు మరుగుదొడ్డి నిర్మాణం గురించి సరైన అవగాహన కల్పించక పోవడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. కేటాయించిన టార్గెట్‌లను పూర్తి చేయలేక అధికారులు ఆపసోసాలు పడాల్సి వస్తోంది.

కలెక్టర్‌ ప్రత్యేక చొరవ
స్వచ్చభారత్‌ మరుగుదొడ్ల నిర్మాణంపై కలెక్టర్‌ బాబురావునాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని మరుగుదొడ్ల నిర్మాణంలో భాగస్వాములను చేసి లక్ష్యాన్ని కేటాయించారు. దీనిపై నిత్యం పర్యవేక్షించడంతోపాటు నివేదికలను ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు.జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులతోపాటు 9వ తరగతి చదివే విద్యార్థులను కూడా మరుగుదొడ్ల నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నారు.

లక్ష్యం సాధించేందుకు కృషి
మరుగుదొడ్ల నిర్మాణం జిల్లాలో స్పీడ్‌గా ఉంది.కలెక్టర్‌ చొవర తీసుకోవడంతోపాటు నిత్యం పర్యవేక్షించడం సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈనెలాఖరుకు జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకున్నాం. లక్ష్యం సాధించేందుకు కృషి చేస్తున్నాం. – సంజీవరావు, ఆర్‌డబ్లూఎస్, ఎస్‌ఈ

మరిన్ని వార్తలు