ఆ యజ్ఞ ఫలం..20 లక్షల ఎకరాలు

8 Jul, 2017 02:22 IST|Sakshi
- 33 ప్రాజెక్టులతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన జల యజ్ఞం
ఇప్పటికే 12 లక్షల ఎకరాలు సాగులోకి.. మరో 8 లక్షల ఎకరాలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్‌: అదో మహోన్నత లక్ష్యం.. ఉమ్మడి రాష్ట్రంలో కరువు కాటకాలను తరిమికొట్టి, కోటి ఎకరాలకు సాగునీటిని అందించేందుకు చేపట్టిన అద్భుత సంకల్పం.. రైతన్న భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకున్న దృఢ నిర్ణయం.. అదే జలయజ్ఞం. ఏళ్ల తరబడి బీళ్లుగా మిగిలిపోయిన భూములకు నీరందించడం ద్వారా తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జలయజ్ఞ ఫలాలు రాష్ట్ర ప్రజలకు చేరువవుతున్నాయి. ఇప్పటికే ఆ ప్రాజెక్టుల కింద 12 లక్షల ఎకరాల మేర సాగునీరు అందుతుండగా.. మరో 8 లక్షల ఎకరాలకు త్వరలో నీరందనుంది.
 
33 ప్రాజెక్టులు చేపట్టి..
తీవ్ర కరువు పరిస్థితులు, వలసలతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం దొరకాలంటే సాగునీటిని అందించాలని, వ్యవసాయానికి ఊతమివ్వాలని భావించిన వైఎస్‌ 2004లో జలయజ్ఞాన్ని చేపట్టారు. ఇందులో మొత్తంగా 86 ప్రాజెక్టుల నిర్మాణం మొదలుపెట్టగా.. అందులో 33 ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నవే. వీటిలో 18 భారీ, 12 మధ్యతరహా ప్రాజెక్టులుకాగా.. రెండు ప్రాజెక్టుల ఆధునీకరణ, ఒక ఫ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయి. ఈ పనులను వైఎస్‌ రూ.1,11,433.23 కోట్లతో చేపట్టారు. మొత్తంగా గోదావరి, కృష్ణా నదీ బేసిన్ల నుంచి సుమారు 387.88 టీఎంసీల నీటిని వినియోగించి.. 51.47 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళికలు తయారు చేశారు. ఇందులో వైఎస్‌ హయాంలోనే గుత్ప, అలీసాగర్, సుద్దవాగు ప్రాజెక్టులను పూర్తిచేసి.. వాటి కింద 1,07,584 ఎకరాలకు సాగు నీరిచ్చారు. ఏఎంఆర్‌పీ, దేవాదుల, ఎస్సారెస్పీ–2, మత్తడివాగు వంటి ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి మరో 4 లక్షల ఎకరాలకు నీరందించారు. 2014 నాటికి కొత్తగా 6 లక్షల ఎకరాలకు సాగునీరందింది. ఇక ఇప్పటివరకు జలయజ్ఞం ప్రాజెక్టుల కింద మొత్తంగా రూ.60 వేల కోట్లు ఖర్చుకాగా సుమారు 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో లక్ష ఎకరాల మేర స్థిరీకరణ జరిగింది.
 
భారీగా ఆయకట్టు వృద్ధిలోకి..
ఈ ఏడాది ఖరీఫ్‌లో 12 ప్రాజెక్టులను వంద శాతం పూర్తిచేయడం, మరో 5 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. తద్వారా సుమారు 8.73 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వృద్ధిలోకి రానుంది. పూర్తికానున్న ప్రాజెక్టుల జాబితాలోని ఎస్సారెస్పీ స్టేజ్‌–2 కింద 1.26 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 80 వేలు, భీమాలో 63 వేలు, కోయిల్‌సాగర్‌లో 30 వేలు, కొమ్రం భీం ప్రాజెక్టు కింద 20వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక వలసలతో కునారిల్లిన పాలమూరు జిల్లాలో సాగు అవకాశాలు పెంచేందుకోసం చేపట్టిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌లు ఈ ఏడాది గరిష్ట ఆయకట్టుకు నీరందించనున్నాయి.

ఈ ప్రాజెక్టుల ద్వారా గతేడాది 4.60 లక్షల ఎకరాలు సాగవగా.. ఈ ఏడాది మొత్తంగా 7 లక్షల ఎకరాలకు నీరందనుంది. వీటితోపాటు ఎల్లంపల్లి, దేవాదుల ప్రాజెక్టు కింద సైతం ఆయకట్టు అవకాశాలు మెరుగయ్యాయి. ఎల్లంపల్లిలో 20 టీఎంసీల నీటిని నిల్వ చేసి.. సుమారు 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు‡ అందిస్తున్నారు. మొత్తంగా వచ్చే ఏడాది నాటికి జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులన్నీ ముగింపు దశకు చేరుకోన్నాయి. దాంతో 30లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు