అలుపెరుగని పోరుఫలం

2 Jul, 2013 16:52 IST|Sakshi
అలుపెరుగని పోరుఫలం

వై.ఎస్...ఇక చరిత్ర పుస్తకంలో ఒక మరపురాని ఘట్టం. ఆ దరహాసం ఒక సజీవ జ్ఞాపకం. ఆయన రాష్ట్ర నాయకత్వం చేపట్టి చరిత్ర సృష్టించడం, ఆయన ముఖం మీద సదా విరిసిన చిరునవ్వంత తేలికగా జరిగింది కాదు. ప్రవాహానికి ప్రతికూలంగా నౌకను నడిపే రాటుదేలిన నావికుని వంటి నాయకుడాయన. రాజకీయాలలో ఆయన మనుగడ, ఎదుగుదల ఒక సుదీర్ఘ పోరాటంతో సాధ్యమైనవి మాత్రమే. ప్రపంచీకరణ ప్రవాహ తాకిడికి తెలుగునేల కోసుకుపోతున్న విపత్కర సమయంలో వైఎస్ ముఖ్యమంత్రి కావడం కూడా చారిత్రక సందర్భమే. లేకపోతే సేద్యాన్ని విస్మరించడం నేలవిడిచి సాము చేయడమన్న వాస్తవాన్ని గుర్తించే అవకాశం వచ్చేదే కాదు.  తెలుగునేల ప్రతి అంగుళం ఆకుపచ్చగా మారాలని స్వప్నించిన తొలినేత ఆయన. కాగితాల మీదే శిథిలమైపోతున్న ప్రాజెక్టులకు ప్రాణం పోసిన మనకాలపు కాటన్ మహాశయుడాయన. అంతటా  సేద్యంతో మన పుడమినీ, అందరికీ వైద్యంతో తన ప్రజలనీ కళకళలాడించాలన్న ఆశయం ఆకృతి దాల్చుతున్న తరుణంలో ఆరుపదుల ప్రాయంలోనే ఆయనకు నూరేళ్లు నిండాయి.
 
 ధవళ వస్త్రాలతో, తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టుతో, తేటతెలుగు నుడికారపు పలుకులతో ఆ నిండు వ్యక్తిత్వం కదలి వస్తుంటే ఓ మలయమారుతం గుండెను చల్లగా తాకి, ఆత్మీయంగా పలకరిస్తున్నట్టు ఉండేది. మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి స్వయంకృషితో అగ్రాసనం అధిష్టించారు. జనం భాష, యాస, ప్రయాస తెలిసినవాడు కాబట్టే వైఎస్‌ను ప్రతి తెలుగువాడూ మనోడు, మన మంచిని చూసేవాడని సొంతం చేసుకున్నారు. ఇంగ్లీషు చదివినా అచ్చతెనుగు పలకరింపు మరిచిపోలేదు. ఊరి దారులు మసకబారలేదు. పల్లెలన్నా, పచ్చని పొలాలన్నా ఆయనకు ప్రాణం.  ఇడుపులపాయ ఎస్టేట్‌ను ఇందుకే కేటాయించారు. డాక్టరీ చదువు ఆధునికత అద్దితే.. పల్లెతనం మనిషితనాన్ని గట్టిగా నిలిపింది. మనిషన్నాక మార్పు ఉండాలని నమ్మేవారిలో వైఎస్ మొదటివారు. అందుకే పాదయాత్ర తనను పూర్తిగా మార్చివేసిందని అంటుండేవారు.
 
 అంతకుముందు వైఎస్ ఆవేశపరుడిగానే తెలుసు. పాలనా పగ్గాలు చేతికందాక హుందాతనానికి చిరునామా అయ్యారు.  తాను మంచి అనుకున్న పనిని చేసేందుకు ఎంతటి శ్రమనైనా లెక్కచేయనితనమే జలయజ్ఞంలాంటి పెద్ద పనులకు వెనుదన్నుగా నిలిచింది. 30 ఏళ్లకు పైగా జనం మధ్య నడుస్తున్న వైఎస్‌కు తెలియంది విసుగు.
 
  మూడు పదులు కూడా నిండని వయస్సులో రాజకీయ అరంగేట్రం చేశారు వైఎస్. తలపండిన నేతలతో తలపడి నిలబడ్డారు. ఎంబీబీఎస్ చదివే రోజుల్లోనే రాజకీయాల వైపు మొగ్గిన వైఎస్, 1975లో కడప జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డి కాంగ్రెస్ అభ్య ర్థిగా ఆవు-దూడ గుర్తుపై పోటీ చేసి జనతా పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి నారాయణరెడ్డిపై గెలిచి నాడే రాజకీయ ప్రస్థానంలో తొలి విజయూన్ని నమోదు చేసుకున్నారు. తర్వాత ఇందిరా కాంగ్రెస్‌లో చేరారు. ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనంలో మహామహులెందరో గడ్డిపరకల్లా కొట్టుకుపోరుునా 13 వేల మెజార్టీతో గెలిచి తన వ్యక్తిగత కరిష్మా ఎలాంటిదో రాష్ట్రానికి చాటి చెప్పారు.  1989, 1991, 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి, 1978, 1983, 1985,1999, 2004, 2009 ఎన్నికల్లో పులివెందుల శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా కీర్తి గడించారు. 1980 చివరి నుంచి 1983 జనవరి మొదటి వారం వరకూ రాష్ట్ర మంత్రివర్గంలో సహాయ, కేబినెట్ మంత్రి హోదాలో గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్, విద్యా శాఖలను నిర్వహించారు.
 
 1983-85 మధ్య మొదటిసారి, 1998-2000 మధ్యకాలంలో రెండోసారి పీసీసీ అధ్యక్షుడిగా, 1985లో సీఎల్పీ ఉప నేతగా, 1999-2003 మధ్యకాలంలో సీఎల్పీ నేతగా ఉన్న ఆయన 2004లో జరిగిన ఎన్నికల అనంతరం మే నెలలో ముఖ్యమంత్రి అరుు రాజకీయ జీవితంలో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారు. ఆ ఐదేళ్ళూ చేసిన అసమాన ప్రజాసేవకు ఫలితంగా 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజలు ఆయనకే పట్టం కట్టారు.
 
 ఎదురీతలోనూ అదే తీరు
 
 వైఎస్ రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం ఎదురీదడమే. మంత్రిగా రెండుమూడేళ్లున్నారు. ఆ తర్వాత పోరాటమే. ఎన్టీఆర్ హవా ముందు సొంత పార్టీ బిత్తరపోయినా గట్టిగా నిలబడింది... పౌరుషంగా మాట్లాడింది వైఎస్సారే!  వైఎస్‌కు ఆటుపోట్లు ఎక్కువయ్యేకొద్దీ అభిమానులూ ఎక్కువయ్యారు. ఎందుకంత జనాకర్షణ? తమ కోసం, తమ బాగు కోసం తుదకంటా పోరాడగలడన్న విశ్వాసం!  రాజకీయాల్లో ఉంటూ జనం మధ్యనే తిరుగుతూ సినీస్టార్‌లకు తీసిపోని జనాకర్షణ సొంతం చేసుకోవడం ఒక్క వైఎస్‌కు మాత్రమే సాధ్యమైంది. మనిషి ఎదురుపడితే చాలు.. హాయిగా నవ్వడం, చేతులు చాపడం వైఎస్‌కే తెలుసు. ఏ విషయంలోనైనా సరే ఏంటట అనే ధీమా చూపుతారు. అదే సమయంలో ఎందుకు కాదంటూ ముందుకురుకుతారు.
 
 ఇవే ఆయనను పీపుల్స్‌స్టార్‌గా తీర్చిదిద్దాయి. రాజశేఖరరెడ్డి ఆవేశానికి ముచ్చటపడి అభిమానులైనవారెందరో.. 1999 ఎన్నికల్లో వైఎస్‌కు ముఖ్యమంత్రి పీఠం అందినట్టే అంది దూరమైంది. ఇక బాబును ఓడించడం ఎవరి తరం కాదన్న మాటలు వినిపించాయి. అయితే ఓటమిని హుందాగా తీసుకోవడమే కాకుండా విపక్ష నాయకుడిగా ఐదేళ్లూ విలక్షణంగా ఎదిగారు. అధికార పార్టీని ఎండగట్టే క్రమంలో ఆయన కచ్చితంగా హోంవర్కు చేసుకుని వచ్చేవారు. అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేవారు. ఆ తీరే జనం గుర్తించేలా చేసింది.
 
 ప్రజాహృదయ నివాసి
 
 నేతలెందరో ఉంటారు. జనం కోసం జనం మధ్యలోంచి వచ్చేవారు కొందరే. నటనలకు దూరంగా నిజ జీవిత సమస్యలకు దగ్గరగా ప్రజలతో పాటు నడుస్తూ పరిణతి చెందిన నాయకుడిగా ఎదగాలంటే చాలా కృషిచేయాలి. అది ఒక్కరోజుతో అయ్యేపని కాదు. అన్నింటికీ మించి జనం పట్ల ప్రేమ ఉండాలి. అధికారం అందితే చాలు.. ప్రజలకు అందనంత దూరంలో తిరుగాడే రాజకీయ నాయకుల తీరుకు విరుద్ధంగా వైఎస్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
 
 పదహారు, పద్దెనిమిది గంటలు పనిచేస్తానని చెప్పకున్నా, 24 గంటల్లో ఎక్కువభాగం ప్రజల మధ్యనే ఉండేవారు. లెక్కలేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు... పేదల ఆకలి తీర్చేవి, గూడిచ్చి నీడిచ్చేవి. ఆరోగ్యానికి భరోసానిచ్చేవి, రైతులకు గుండెధైర్యాన్నిచ్చేవి. మహిళలు, విద్యార్థుల బతుకుల్లో వెలుగులు నింపేవి.  సామాన్య ప్రజల నాడి తెలిసిన డాక్టర్... వైఎస్.  గ్రామీణ పేదరికానికి, దానితో తలెత్తే రోగాలకు విరుగుడు కనిపెట్టాలన్నదే ఆ డాక్టర్ ఆలోచన. రాజకీయనేతగానూ వైఎస్ తపన అదే.  అది ఏ కడపకో పరిమితమై పోలేదు. కన్నతల్లి లాంటి సొంతగడ్డపై మమకారం కాస్త ఎక్కువైనా.. ఆంధ్ర రాష్ట్రమంటే చాలా అభిమానం. 34 ఏళ్లకే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాష్ట్రాన్ని చుట్టివచ్చిన అనుభవం .. ముచ్చటగా మూడు ప్రాంతాల్లో అభిమానులను సాధించి పెట్టింది. వైఎస్ మరణమంటే నిర్మాణాత్మక ఆలోచనకు ఒక విరామ చిహ్నం.
 
 
 వైఎస్ వంశవృక్షం
 వైఎస్ వెంకటరెడ్డి,  భార్యలు - గంగమ్మ, మంగమ్మ
 గంగమ్మ సంతానం : చిన్న కొండారెడ్డి
 మంగమ్మ సంతానం : పెద్దకొండారెడ్డి, సుగుణమ్మ, ప్రభుదాస్‌రెడ్డి, రత్నమ్మ, రాజారెడ్డి, రాజమ్మ, డాక్టర్ పురుషోత్తంరెడ్డి, డాక్టర్ మేరీ పునీతమ్మ, కమలమ్మ.
 వైఎస్ రాజారెడ్డి - జయమ్మ
 1) జార్జిరెడ్డి, (2) రాజశేఖరరెడ్డి (3) వివేకానందరెడ్డి (4) విమలమ్మ (5) సుధీకర్‌రెడ్డి (6) రవీంద్రనాథ్‌రెడ్డి
 వైఎస్ జార్జిరెడ్డి - భారతీరెడ్డి
 సునీల్‌రెడ్డి - కులశ్రీ, వారి సంతానం సాహిల్, శ్రావణ్
 అనిల్‌రెడ్డి - మాలిని, ...  శ్రేయ,  సజీవ్
 వైఎస్ రాజశేఖరరెడ్డి - విజయలక్ష్మి  
 షర్మిల - అనిల్‌కుమార్ .... రాజారెడ్డి, అంజలి
 జగన్‌మోహన్‌రెడ్డి - భారతి ... హర్ష, వర్ష
 వైఎస్ వివేకానందరెడ్డి - సౌభాగ్యమ్మ
 సునీత - రాజశేఖరరెడ్డి ... రజిత, వివేక్
 బి.విమలమ్మ - కుమార్‌కోటిరెడ్డి
 యువరాజ్ - శ్రావణి ..... దేవరాజ్, సుజయ్
 దివ్య - బైజు ..... ఇష్వి, అషయ్
 వైఎస్ సుధీకర్‌రెడ్డి - విద్య .... వెరొనికా - విష్ణువర్దన్
 వైఎస్ రవీంద్రనాథ్‌రెడ్డి - జయ ....  రాగదీప్,  సుమధుర్
 
 ‘రాజ’పథం
 
 1949, జూలై 8 న  వై.ఎస్. రాజారెడ్డి, జయమ్మ దంపతులకు కడప జిల్లా జమ్మలమడుగులోని క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిలో రాజశేఖరరెడ్డి జన్మించారు.
 
 విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ, కర్ణాటకలోని గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదివారు. ఎస్.వి. మెడికల్ కళాశాలలో హౌస్‌సర్జన్ చేశారు. అప్పుడు హౌస్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు.
 
 కొద్దికాలం జమ్మలమడుగు మిషన్ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. 1973లో తండ్రి పేరిట పులివెందులలో 70 పడకల ఆస్పత్రి నిర్మించారు. నాలుగేళ్ళు వైద్య సేవలందించారు.
 
 రాజకీయరంగ ప్రవేశం-1975లోమొదట్లో కమ్యూనిస్టు భావాల పట్ల ఆకర్షితులు. 1978లో కాంగ్రెస్ (ఆర్)లో పనిచేశారు . పులివెందుల నుంచి 29 ఏళ్ల వయసులోనే అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
 
 33 ఏళ్ల ప్రాయంలోనే పీసీసీ నేతగా బాధ్యతల స్వీకారం. 1983-85, 1998-2000 మధ్య రాష్ట్ర కాంగ్రెస్(పీసీసీ) సారథిగా ఉన్నారు. 1999 నుంచి 2004 వరకు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత.
 
 రాయలసీమ నీటి సంక్షోభ నివారణకు ఎమ్మెల్యేలతో కలిసి ఆమరణ  నిరాహారదీక్ష చేపట్టారు. అనంతపురం జిల్లా లేపాక్షి నుంచి కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు వర కు పాదయాత్ర చేశారు.
 
 ఆగస్టు, 2000లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా తన సహచర శాసన  సభ్యులతో కలిసి పద్నాలుగు రోజులు నిరాహారదీక్ష చేసి సంచలనం సృష్టించారు.
 
 2003లో మండు వేసవిలో ఆయన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సుమారు 1,400 కిలోమీటర్ల దూరం రెండు నెలలకు పైగా పాదయాత్ర చేిశారు. అదే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది.
 
 2004 మే14న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రైతులకు ఉచిత విద్యుత్ బిల్లుపై మొదటి సంతకం చేశారు.
 
 14 మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పనిచేయగా, కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావుల తర్వాత నాలుగేళ్లకు పైగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కాంగ్రెస్ నేతగా గుర్తింపు పొందారు. రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి కాంగ్రెస్ నేతగా రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో పదవిలో ఉండగా మరణించిన మొదటి ముఖ్యమంత్రి కూడా ఆయనే.
 వైద్యుడైన వై.ఎస్ పేదల కోసం ‘ఆరోగ్యశ్రీ’ ప్రారంభించారు.
 
 2009, సెప్టెంబర్ 2న పల్లెబాటలో భాగంగా రచ్చబండ సమావేశాల్లో పాల్గొనడానికి ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలు దేరారు. గంట తర్వాత ఆయన ప్రయూణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ తెలియకుండా పోరుుంది.
 
 2009, సెప్టెంబర్ 2న రాజశేఖర రెడ్డి, ఆయనతో పాటు ఉన్న మరో నలుగురు హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు.
 
 చరిత్రలో ఆయన స్థానం సుస్థిరం
 
 రాష్ట్ర చరిత్రలో డాక్టర్ వై.ఎస్. స్థానం అనితర సాధ్యమైనది. ప్రధానంగా సొంత బలంతో, సొంత వ్యూహాలతో అసెంబ్లీకి, పార్లమెంట్‌కు అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తిరుగులేని ప్రజాదరణతో ముఖ్యమంత్రి కాగలిగిన ఏకైక నేత వై.ఎస్. మొన్నటి ఎన్నికలలో పార్టీ గెలిచినా, ఓడినా తనదే బాధ్యత అని ప్రకటించిన వై.ఎస్.కు సాటి మరొకరు కనిపించరు. వై.ఎస్. ఐదేళ్ల స్వల్పకాలంలో అమలు జరిపినన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరే ముఖ్యమంత్రి చేపట్టిన దాఖలాలు లేవు. తన విధానాలు, సిద్ధాంతాలు, వ్యూహాలపట్ల ఆయనకు ఉన్న విశ్వాసం అచంచలమైనది.
 
 ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ రచయిత 2 రూపాయల కిలో బియ్యం పథకం వలన చాలా కష్టాలు వస్తాయని వాదిస్తే, ‘‘నేను నా ప్రజలకు మాటిచ్చాను, వెనుదిరిగే ప్రసక్తి లేదు’’ అని చెప్పడం ఆయన మూర్తిమత్వ విలక్షణతకు అద్దం పడుతుంది. తొలినాళ్లలో రాయలసీమ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వై.ఎస్. క్రమంగా కోస్తా, తెలంగాణ ప్రజల ఆదరణకు పాత్రులయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌లో తిరుగులేని మహానాయకుడు అనిపించుకుని, జాతీయ స్థాయిలోనూ ఏ అగ్రశ్రేణి నాయకునికీ తీసిపోని విధంగా తనదైన స్థానం సంపాదించుకున్న వై.ఎస్. భావితరాల స్మృతిపథంలో, దేశ చరిత్రలో శాశ్వతంగా నిలుస్తారు.
  పొత్తూరి వెంకటేశ్వరరావు  సీనియర్ పాత్రికేయులు
 
 విలక్షణత వై.ఎస్. మార్గం
 వై.ఎస్. అకాల మరణం రాష్ట్రానికే కాదు, యావత్ భారతా వనికే తీరని లోటు. ఎవరూ చేపట్టనన్ని సంక్షేమ పథకాలను చేపట్టిన ఘనుడు వైఎస్. ముఖ్యమంత్రిగా ఆదర్శ మూర్తిగా నిలిచిన వై.ఎస్. మార్గం ముందు తరాల వారికి స్ఫూర్తిదాయకం అవుతుంది. తన ఆచరణతో అందరి మన్ననలు పొందిన అసాధారణ ప్రజ్ఞ వైఎస్. సొత్తు. మహాసాహసిగా మృత్యువుతో పందెంకాసి సామాన్యుల ఆశలను అడియాసలు చేసి అందనంత దూరాలకు వెళ్లిపోయిన వై.ఎస్. తన నిష్ర్కమణలో సైతం విలక్షణుడిగా నిలవడం విశేషం.
 కొండా లక్ష్మణ్ బాపూజీ  స్వాతంత్య్ర సమరయోధుడు
 
 పట్టుదలకు పెట్టింది పేరు
 రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన నా అనుభవంలో వైఎస్ లాంటి విలక్షణమైన రాజకీయ నాయకుడు, పట్టుదలకు పెట్టింది పేరయిన ముఖ్యమంత్రి మరొకరు లేరు. నిబద్ధతలో, నిజాయితీలో, అన్న మాటకు నిష్కర్షగా కట్టుబడి పనిచేయడంలో ఆయన పడ్డ తపన మరే కాంగ్రెస్ నాయకుడిలోనూ నేనిప్పటి వరకూ చూడలేదు. స్వాతంత్య్రానికి పూర్వం, సాతంత్య్రానంతరం రాష్ట్ర చరిత్రలో ప్రజలు మరచిపోలేని రెండు గొప్ప పరిణామాలు- ఇచ్ఛాపురం నుంచి మద్రాసు వరకూ రైతాంగ సమస్యల మీద నాటి ప్రభుత్వానికి మహజరు సమర్పించడానికి 1936-37లో సాగిన సుదీర్ఘ పాదయాత్ర  ఓ స్ఫూర్తికాగా, ఆ తరువాత 2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం దాకా వైఎస్ సాగించిన ‘ప్రజాప్రస్థాన పాదయాత్ర’  రైతు వికాసానికి ఊపిరి పోసిన చరిత్రగా మిగిలిపోయింది. అంతేకాక, రాష్ట్ర చరిత్రలో క్లిష్టమైన దశలో ‘రాష్ట్ర సమైక్యత’ను కాపాడి, హైకమాండ్‌ను సైతం ఒప్పించి, మెప్పించిన ఏకైక నాయకుడు. అది ఆయన సామర్థ్యానికి పరాకాష్ట. అలాంటి నాయకుడ్ని కోల్పోవడం మనందరికీ తీరని లోటే.
 ఎ.బి.కె.ప్రసాద్  సీనియర్ పాత్రికేయులు
 
 పేదల గుండె చప్పుడు
 లక్షలాది పేద ప్రజల అభిమానాన్ని చూరగొన్న వైఎస్ కాంగ్రెస్‌లో కార్యసాధనపట్ల ఆసక్తిని ప్రదర్శించిన నాయకుడు. తాను అనుకున్నది సాధించే క్రమంలో ఎన్ని అడ్డంకులనైనా ఎదుర్కోగల ఆత్మవిశ్వాసం గల నేత. ప్రతిపక్ష నాయకునిగానే కాదు, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక కూడా వైఎస్, తక్షణమే పరిష్కరించాలని భావించిన సమస్యల్లో నక్సలైట్ల సమస్య ఒకటి. ఫలితం ఏమయిందన్నది పక్కన పెడితే, దాన్ని పరిష్కరించుకోవాలనడంలో ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. చర్చలకు ఆహ్వానించడమే ఒక చరిత్ర. అది అనుకున్న ఫలితాలు సాధించి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోలా ఉండేవి. రెండు రూపాయల కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేద ప్రజల పరిస్థితిని పూర్తిగా మార్చలేకపోయినా, చాలా వరకు ఊరటనైతే కలిగించగలిగాయన్నది వాస్తవం.
 బొజ్జా తారకం  హైకోర్టు సీనియర్ న్యాయవాది
 
 ఆశయాల కొనసాగింపే నివాళి
 
 2004లో అధికారంలోకి రాకముందు ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి వైఎస్ చరిత్రాత్మకమైన పాదయాత్ర సాగించారు. ప్రజలు స్పందించి అఖండ విజయంతో సముచితంగా సత్కరించారు. ఆరేళ్ల తరువాత ఆ ప్రజలనే స్వయంగా కలిసి తన పరిపాలనా ఫలితాలు ఎంత వరకూ వారికి చేరుతున్నాయో తెలుసుకోవడానికి బయలుదేరారు. కానీ, మొదటి విడత ప్రయాణంలోనే ఆయన తిరిగిరాని దూరతీరాలకు వెళ్లిపోవడం విచారకరం. ఆయన తలపెట్టిన యాత్ర పూర్తిగా కొనసాగి ఉంటే, పాలనా యంత్రాంగంలో పాతుకుపోయిన లోపాలను కొంతమేరకైనా పరిష్కరించే అవకాశం ఏర్పడేది. ఆయన మరణం పేద ప్రజలకు తీరని లోటు. ఆ పేదలకు ఆయన ప్రారంభించిన పథకాలను కొనసాగించడమే ఆయనకు అందించే ఘనమైన నివాళి. వైఎస్ కుటుంబ సభ్యులకు, దుర్ఘటనలో మరణించిన ఉన్నతాధికారి పి.సుబ్రమణ్యం, భద్రతాధికారి వెస్లీ, పైలట్లు భాటియా, ఎం.ఎస్.రెడ్డి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
 వి.హనుమంతరావు  సీనియర్ పాత్రికేయులు
 
 నిమగ్నత వైఎస్ విజయ రహస్యం


 వైఎస్ మనసు వెన్నలాంటి రైతు మనసు. రైతు తత్వానికి ఆయన అచ్చమైన ప్రతినిధి. తెలుగుదనానికి,  స్థానీయతకు ఆయన నిలువుటద్దంలా నిలుస్తారు. మన ఇంటి వీధిలోని పెద్దాయన మనతో మాట్లాడినట్టు ఉంటుంది వైఎస్ మాట్లాడుతుంటే. రాజకీయాల్లో కొత్త ఒరవడికి దారులు వేసిన ఖ్యాతి వైఎస్‌కు దక్కుతుంది. తీసుకున్న నిర్ణయాలకు నిమగ్నతతో కట్టుబడి ఉంటే ధీశాలి వైఎస్. పార్లమెంటరీ రాజకీయాల పరిధిలో, తన ఆచరణకు అవి విధించిన పరిమితులు పాటిస్తూనే పేదలకు, రైతులకు చేయగలిగినంత చేసిన అరుదైన రాజకీయ నేత వైఎస్. విద్యార్థుల ఫీజుల మాఫీ, అందరికీ ఆరోగ్యశ్రీ పథకం, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధాప్య పింఛన్లు వంటి ఎన్నెన్నో సంక్షేమ పథకాలతో పేద ప్రజల కన్నీరు తుడిచిన సున్నిత మనస్కుడు, మంచి మనిషి వైఎస్.
 గోరటి వెంకన్న  కవి
 

మరిన్ని వార్తలు