వ్యాక్సిన్‌ తీసుకోను, ఇది నా హక్కు

27 Nov, 2020 10:44 IST|Sakshi

ప్రజలకూ వ్యాక్సినేషన్‌ అవసరంలేదు

కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో మాస్క్‌ పాత్ర తక్కువే

బ్రెజిల్‌ ప్రెసిడెండ్‌ బోల్సొనారో సంచలన ప్రకటన

న్యూఢిల్లీ, సాక్షి: కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను తీసుకోబోనని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో తాజాగా స్పష్టం చేశారు. కోవిడ్‌-19ను ఎదుర్కొనే అంశంలో తొలి నుంచీ వ్యాక్సినేషన్లను వ్యతిరేకిస్తూ వస్తున్న ఆయన వ్యాక్సిన్‌ను తీసుకోనంటూ మరోసారి ప్రకటించారు. ఇది నా హక్కు అంటూ బోల్సొనారో పేర్కొన్నారు. కోవిడ్‌-19ను నిరోధించేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను వీటిని వినియోగించబోనని తెగేసి చెప్పారు. అంతేకాకుండా బ్రెజిల్‌ దేశ ప్రజలకు సైతం వ్యాక్సిన్ల అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్‌-19 కేసులు నమోదైన దేశాలలో బ్రెజిల్‌ మూడో స్థానంలో నిలుస్తుండటం గమనార్హం!  (విలేకరులు పిరికి వాళ్లు: బోల్సొనారో)

కరోనా బారిన పడినా..
కాగా బోల్సొనారో సైతం జులైలో కరోనా వైరస్‌బారిన పడ్డారు. అయితే ఇప్పటికే వ్యాక్సినేషన్ల ప్రోగ్రామ్‌లపై బోల్సొనారో పలుమార్లు అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. కాగా.. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో మాస్క్‌లు అంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు స్పష్టం కాలేదని అభిప్రాయపడ్డారు. వైరస్‌ను మాస్క్‌లు అడ్డుకుంటున్నట్లు స్వల్ప ఆధారాలు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తన పెంపుడు కుక్కకు మాత్రమే అవసరమున్నట్లు అక్టోబర్‌లో ట్విటర్‌ ద్వారా బోల్సొనారో జోక్‌ చేశారు. బ్రెజిల్‌ ప్రెసిడెంట్‌ ప్రకటనలు పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నట్లు ఈ సందర్భంగా ఆంగ్ల వార్తా సంస్థ రాయిటర్స్‌ పేర్కొంది. (బోల్సొనారోకు మళ్లీ కరోనా పాజిటివ్‌!)

మరిన్ని వార్తలు