డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బహుముఖ వ్యక్తిత్వం 

3 Dec, 2020 18:52 IST|Sakshi

దేశంలోనే అత్యున్నత పదవిని పొందిన తొలి వ్యక్తి మన దేశ తొలి రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్‌ బాబు రాజేంద్ర ప్రసాద్‌. అంతేకాదు ఆయన ఒక గొప్ప గురువుగా, న్యాయవాదిగా, మంచి రచయితగా, స్వాతంత్ర్య సమరయోధుడుగా ఇలా ఎన్నో సేవలను అందించారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బహుముఖ వ్యక్తిత్వం గలవారు. బిహార్ శివాన్ జిల్లాలోని జెర్దాయ్ గ్రామంలో ఆయన 1884 డిసెంబరు 3న జన్మించారు. బాల్యం నుంచే రాజేంద్ర ప్రసాద్‌ చురుగ్గా ఉండేవారు.

బిహార్‌లో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన ఆ తర్వాత అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా పొందారు. కొన్నాళ్లు బిహార్, ఒడిశా హైకోర్టులలో పనిచేశారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. మహాత్మా గాంధీచే బాగా ప్రభావితమైన రాజేంద్ర ప్రసాద్‌ 1931 నాటి 'ఉప్పు సత్యాగ్రహం' 1942లో జరిగిన  'క్విట్ ఇండియా ఉద్యమం' లో చురుగ్గా పాల్గొన్నారు. అనేకమంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులతో పాటు ఆయన కూడా జైలు జీవితం గడిపారు.

1946 సెప్టెంబరు 2న జవాహర్ లాల్ నెహ్రూ  కేబినెట్‌లో రాజేంద్ర ప్రసాద్ ఆహార, వ్యవసాయ శాఖకు మంత్రిగా పని చేశారు. జీపీ కృపాలానీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన తరువాత 1947 నవంబరు 17న కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. 1950 నుండి 1962 వరకు ఆయన భారత రాష్ట్రపతిగా పని చేశారు. ఆయనకు 1962లో అత్యున్నత పౌర పురస్కారం భరత రత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.


 

whatsapp channel

మరిన్ని వార్తలు