టీడీపీ శవ రాజకీయాలు!

24 Feb, 2023 15:36 IST|Sakshi
సాక్షి, నరసరావుపేట: టీడీపీకి శవరాజకీయాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడ హత్య జరిగినా వైఎస్సార్‌ సీపీపై నెపం నెట్టి ఆరోపణలు చేయడం అలవాటుగా మారింది. టీడీపీలో ఆధిపత్యం కోసం జరిగిన పోరాటంలో హత్య జరిగితే దాన్ని వైఎస్సార్‌ సీపీపై నెట్టి టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. ఈ నెల 2న తుపాకీ కాల్పుల్లో రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డి తీవ్రంగా గాయపడి 20 రోజుల చికిత్స అనంతరం మంగళవారం మరణించిన నేపథ్యంలో శవరాజకీయాలకు మరోసారి తెరలేపింది.
హత్యచేసింది అల్లుడే..
బాలకోటిరెడ్డికి అల్లుడు వరుసయ్యే పమ్మి వెంకటేశ్వరరెడ్డి టీడీపీలో క్రీయాశీలకంగా ఉంటూ రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. భవిష్యత్తులో పార్టీలో మంచి గుర్తింపు, పదవులు అప్పగిస్తానని చెప్పి గత పంచాయతీ ఎన్నికలు, గ్రామంలో జరిగే ప్రసన్నంజనేయస్వామి తిరునాళ్లకు నిందితుడు వెంకటేశ్వరరెడ్డితో డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయించారు హత్యకు గురైన బాలకోటిరెడ్డి. తదనంతరం నిందితుడిని పట్టించుకోకుండా పార్టీలో కూడా సరైన స్థానం ఇవ్వకుండా చేస్తుండటంతో బాలకోటిరెడ్డిపై వెంకటేశ్వరరెడ్డి కక్ష పెంచుకున్నాడు. బాలకోటిరెడ్డి బతికి ఉండగా తనకు పార్టీలో స్థానం ఉండదని, గుర్తింపు లభించదని భావించాడు. ఎలాగైనా బాలకోటిరెడ్డిని చంపాలనే ఉద్ధేశంతో గత ఏడాది జూలై 19వ తేదీ నిందితుడు వెంకటేశ్వరరెడ్డి దాడిచేసి చంపే ప్రయత్నం చేశాడు. తీవ్ర గాయాలతో బాలకోటిరెడ్డి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ విషయమై రొంపిచెర్ల పోలీసులు వెంకటేశ్వరరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదుచేసి జైలుకి పంపారు. జైలులో రౌడీషీటర్‌ అంజిరెడ్డితో వెంకటేశ్వరరెడ్డి పరిచయం పెంచుకున్నాడు. అతనికి జరిగిన విషయాలు చెప్పి తనకు సహాయం చేయమని కోరినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం పమ్మి వెంకటేశ్వరరెడ్డి అంజిరెడ్డి, వెంకటేశ్వర్లు, రాములు అనే వ్యక్తులతో బాలకోటిరెడ్డి ఇంటికి వెళ్లి అతడిని బయటకు పిలిచి తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపారు. బుల్లెట్‌ నడుం కింది భాగంలోకి దూసుకెళ్లటంతో బాలకోటిరెడ్డి తీవ్ర గాయంతో పడిపోయాడు. బాలకోటిరెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇస్తూ తనపై హత్యాయత్నం చేసింది టీడీపీ నేత పమ్మి వెంకటేశ్వరరెడ్డి, మరో ముగ్గురు కిరాయి ముఠా అని తెలిపారు. హతుడి భార్య సైతం తన భర్తను చంపింది టీడీపీ నేత వెంకటేశ్వరరెడ్డి అంటూ పలు టీవీ చానళ్లలో సైతం మాట్లాడింది.
పట్టించుకోని అరవింద్‌ బాబు..
ఏడాదికిపైగా బాలకోటిరెడ్డి, పమ్మి వెంకటేశ్వరరెడ్డి మధ్య అధిపత్య గొడవలు జరుగుతున్నా ఆ పార్టీ నరసరావుపేట ఇన్‌చార్జి చదలవాడ అరవింద్‌బాబు పట్టించుకోలేదు. వెంకటేశ్వరరెడ్డి అరవింద్‌బాబుకు ప్రధాన అనుచరుడిగా ఉంటున్నాడు. గత ఏడాది జూలై 19న హత్యాయత్నం చేసిన తర్వాతైనా ఆ పార్టీ పెద్దలు ఇద్దర్ని కూర్చోబెట్టి సర్దుబాటుచేయాల్సింది. వారి నిర్లక్ష్యంతో హత్య జరిగిన తర్వాత ఎప్పటిలాగే నెపం వైఎస్సార్‌ సీపీపై నెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఒక్క చిన్న ఆధారం కూడా చూపకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మాపార్టీకి సంబంధం ఉన్నట్టు ఏదైనా ఆధారం చూపాలని స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన సవాలుకు బదులిచ్చే సాహసం టీడీపీ నేతలు చేయడం లేదు. బాబు దూతలమంటూ వచ్చిన వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, గద్దె రామ్మోహన్‌కు అసలు విషయం తెలిసినా, స్క్రిప్ట్‌ ప్రకారం నాటకం రక్తి కట్టించి వెళ్లారు. బాలకోటిరెడ్డి శవాన్ని స్వగ్రామం అలవాలకు కాకుండా నరసరావుపేటలో ర్యాలీ చేయాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుచెప్పడంతో ఎస్‌ఆర్‌కే జంక్షన్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి వాహనదారులకు ఇబ్బందులు కలిగించారు. టీడీపీ శవరాజకీయాలు చూసి ప్రజలు అసహ్యించుకోవడం గమనార్హం.

టీడీపీలో ఆధిపత్యం కోసం జరిగిన హత్యపై రాద్ధాంతం రొంపిచర్ల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిని చంపింది అల్లుడు వరసయ్యే పమ్మి వెంకటేశ్వరరెడ్డి వాంగ్మూలంలో బాలకోటిరెడ్డి, ఆయన భార్య అదే చెప్పారు వెంకటేశ్వరరెడ్డి టీడీపీలో క్రియాశీలక నేత ఏ ఆధారం లేకపోయినా వైఎస్సార్‌ సీపీపై నెపం మోపుతున్న ప్రతిపక్ష పార్టీ విజయవాడ నుంచి చంద్రబాబు దూతల పేరిట వచ్చి శవరాజకీయం చేసిన వర్ల, బుద్దా, గద్దె

మరిన్ని వార్తలు