● కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన ‘బండి’ పర్యటన ● అడుగడుగునా ప్రజాదరణ.. చేరికలతో సందడి ● ఆదిలాబాద్‌లో పోటీ చేయాలంటూ ఎంఐఎంకు సంజయ్‌ సవాల్‌ ● ‘మిస్టర్‌ 40 పర్సెంట్‌’ అంటూ స్థానిక ఎమ్మెల్యేపై సైటెర్‌

5 Mar, 2023 00:36 IST|Sakshi

ర్యాలీలో పాల్గొన్న పార్టీ శ్రేణులు

సాక్షి, ఆదిలాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జిల్లా పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. శనివారం రాత్రి జిల్లా కేంద్రంలో కొనసాగిన ర్యాలీలో అడుగడుగునా ప్రజాదరణ కనిపించింది. చేరికలతో సందడి నెలకొంది. సంజయ్‌ ప్రసంగం బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తూ సాగింది. కేసీఆర్‌ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ.. మోదీ కారణంగా దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం తీసుకురావాలంటూనే.. ఎంఐఎంపై ధ్వజమెత్తారు. మొత్తంగా ఆయన పర్యటన విజయవంతమైంది. కాగా సభ అనంతరం ఇటీవల మెడికో ప్రీతి మృతిపై నివాళులర్పిస్తూ బీజేపీ నాయకులు ప్రాంగణం నుంచి కొంత దూరం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.

ఆలస్యంగా రాక..

జిల్లా కేంద్రానికి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు బండి సంజయ్‌ చేరుకుంటారని ముందుగా ఆ పార్టీ వర్గాలు వెల్లడించగా..ఆయన మాత్రం సాయంత్రం 6.45 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. స్థానిక ఠాకూర్‌ హోటల్‌ వద్ద సంజయ్‌కు ఎంపీ సోయం బాపూరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌, మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఓపెన్‌టాప్‌ వాహనంలో అక్కడినుంచి ఆయన పట్టణంలో ర్యాలీగా కదిలారు. వందలాది మంది కార్యకర్తలు పాల్గొనడంతో సభ ప్రాంగణానికి వచ్చేసరికి గంటకు పైగా సమయం పట్టింది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో స్థానిక జనార్దన్‌రెడ్డి గార్డెన్‌కు చేరుకున్నారు. అప్పటికే ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లా నుంచి పలువురు నేతలు తరలివచ్చారు. జిల్లాకేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.

భారీగా చేరికలు..

మావల మాజీ సర్పంచ్‌, ప్రస్తుత కౌన్సిలర్‌ ఉష్కం రఘుపతి, డీసీసీబీ డైరెక్టర్‌ దుర్గం రాజేశ్వర్‌, నాయకులు దారట్ల జీవన్‌, ఇతరులు బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీల నుంచి కూడా కార్యకర్తలు కమలం గూటికి చేరారు. కాగా వందలా ది మంది చేరికలతో వేదిక ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బండి సంజయ్‌ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొని ఫొటో దిగేందుకు ఆసక్తి కనబర్చడ ంతో అక్కడ అదుపు చేయలేని పరిస్థితి కనిపించింది.

ఎంఐఎంకు సవాల్‌..

సభకు జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ అధ్యక్షత వహించారు. ఆయనతో పాటు సోయం బాపురావు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ స్థానిక సమస్యలను లేవనెత్తారు. ప్రధానంగా రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం కేంద్రం రూ.150 కోట్లు కేటాయించి నిర్మిస్తే ఇప్పటికీ స్టాఫ్‌ను నియమించకపోవడంపై విమర్శలు గుప్పించారు. కొరటా–చనాఖా బ్యారేజ్‌ నుంచి ఇప్పటివరకు ఒక్క ఎకరం కూడా పారలేదని ధ్వజమెత్తారు. పిప్పల్‌కోటి రిజర్వాయర్‌ కింద భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం తగ్గించి ఇవ్వడంపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నను మిస్టర్‌ 40 పర్సెంట్‌ అంటూ సైటెర్‌ వేశారు. ప్రతి అభివృద్ధి పనుల్లో అంత కమీషన్‌ తీసుకుంటారంటూ ధ్వజమెత్తారు. మరోవైపు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతూ అందినకాడికి దండుకుంటున్నారని విమర్శలు చేశారు. పోడు భూముల సమస్యను ఈ ప్రభుత్వం పరిష్కరించలేక పోతుందన్నారు. ఎంఐఎం పార్టీకి బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. పౌరుషం ఉంటే ఆదిలాబాద్‌ గడ్డమీద పోటీ చేయాలన్నారు. కాషాయ భగభగ ముందు మసికావడం ఖాయమన్నారు. ఈ గడ్డ మీద కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నేతలు పాల్గొన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చిట్యాల సుహాసినిరెడ్డి, జగిత్యాల మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ భోగ శ్రావణి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, నిర్మల్‌ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి, సీనియర్‌ నాయకులు రామారావు పటేల్‌, ఖానాపూర్‌ నాయకులు హరినాయక్‌, సట్ల అశోక్‌, రాష్ట్ర నాయకులు సంగప్ప తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు