మంగ్లీ గ్రామాన్ని సందర్శించిన ట్రైనీ కలెక్టర్‌

29 Apr, 2023 12:04 IST|Sakshi
గ్రామస్తులతో మాట్లాడుతున్న ట్రైనీ కలెక్టర్‌ శ్రీజ

ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని వాన్‌వాట్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామమైన మంగ్లీ గ్రామాన్ని ట్రైనీ కలెక్టర్‌ పి.శ్రీజ కాలినడకన వెళ్లి శుక్రవారం సందర్శించారు. గ్రామానికి గతంలో గవర్నర్‌ అసిస్‌స్టెట్‌ నిధుల నుంచి రూ.10లక్షలతో ఎస్టీ కమ్యూనిటీ హాల్‌, మరో రూ.11లక్షలతో అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయి.

గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. వర్షాలు ప్రారంభమైతే గ్రామ నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్‌ తీసుకెళ్లడం కష్టామని, అప్పటిలోగా తాత్కాలిక రోడ్డు వేయించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. స్పందించిన ఆమె ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి తాత్కాలిక రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.

అనంతరం అక్కడి నుంచి మామిడిగూడలోని సబ్‌ సెంటర్‌ను సందర్శించిన ఆమె మంగ్లీ గ్రామంలో వెంటనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చిన్నారులతో పాటు గర్భిణులకు వైద్య పరీక్షలు చేయాలని వైద్యులకు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఆమె వెంట ఏఈఈ సలావుద్దీన్‌, కాంట్రాక్టర్‌ ప్రకాష్‌ చౌహన్‌, సర్పంచ్‌, ఎంపీటీసీ ఉన్నారు.

మరిన్ని వార్తలు