రేణుక సిమెంట్‌ ఫ్యాక్టరీ స్థలం వద్ద నిర్వాసితుల ఆందోళన

28 May, 2023 00:12 IST|Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: సిమెంట్‌ ఫ్యాక్టరీ ప్రారంభమయ్యేంత వరకు తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలంటూ ఆదివాసీలు పోరుబాట పట్టారు. ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పిస్తామంటే నమ్మి భూములిచ్చామని, ఏళ్లు గడిచినా స్పందన లేకపోవడంతో తామంతా కూలీలుగా మారామంటూ ఆందోళనకు దిగారు. పురుగుల మందు డబ్బాలతో ఎడ్లబండ్లపై తరలివచ్చారు. తమ భూముల్లోకి అనుమతించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. భూమిని దున్నేందుకు యత్నించగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం రామాయి శివారులోగల రేణుక సిమెంట్‌ ఫ్యాక్టరీకి సంబంధించిన స్థలం వద్ద నిర్వాసితులు చేపట్టిన ఆందోళన శనివారం ఉద్రిక్తతకు దారితీసింది.

అసలేం జరిగిందంటే..
ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని రాంపూర్‌, రామాయి, తదితర గ్రామాలకు చెందిన ఆదివాసీ రైతులు రేణుక సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఐదేళ్ల క్రితం తమ భూములు ఇచ్చారు. మూడేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పిన సంబంధిత యాజమాన్యం వారి నుంచి 107 ఎకరాలు సేకరించింది. ఐదేళ్లయినా ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణం అయ్యేంత వరకు తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలంటూ ఆదివాసీలు ఎడ్లబండ్లతో తరలివచ్చి ఆందోళనకు దిగారు. మహిళలు పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేసే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో మహిళలు పోలీసు వాహనంపై ఎక్కి నిరసన తెలిపారు. మా భూముల్లోకి మమ్మల్ని అనుమంతించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

వారిని కిందకు దించేందకు యత్నించగా తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. అరెస్టు చేసి పలు స్టేషన్లకు తరలించారు. పరిశ్రమ ఏర్పాటు విషయంలో మాట మార్చిన యాజమాన్యంపై చర్యలు చేపట్టకుండా భూములు త్యాగం చేసిన తమపై కేసులు ఏవిధంగా నమోదు చేస్తారని వారు ప్రశ్నించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. సర్కార్‌ స్పందించకపోతే తామే రంగంలోకి దిగుతామని హెచ్చరించారు. కాగా, 22 మంది ఆందోళనకారులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ రఘుపతి తెలిపారు.

ఫ్యాక్టరీ కోసం భూములిచ్చారు.. : సుహాసిని రెడ్డి
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి మాట్లాడుతూ, ఆదివాసీ రైతులు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు ఇచ్చారు కాని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునేందుకు కాదన్నారు. మూడేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి భూములను తీసుకొని క్షీరాభిషేకం చేసుకున్న ఎమ్మెల్యే జోగు రామన్న ఎందుకు స్పందించడం లేదన్నారు.

‘నిరసన చేపడితే అరెస్టు చేస్తారా..’
ఆదిలాబాద్‌రూరల్‌: రేణుక సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ శనివారం శాంతియుతంగా నిరసన చేపడితే పోలీసులు అరెస్టు చేయడం సరికాదని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేశ్‌ అన్నారు. బాధిత రైతులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. మావల మండలం బట్టిసావర్‌గాం శివారు కుమురం భీం గూడలో శనివారం ఆయన మాట్లాడారు. తమకు న్యాయం చేయాలని ఆదివాసీ రైతులు కోరగా.. కనీసం మహిళలని కూడా చూడకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదన్నారు.

107 ఎకరాల భూమి కొనుగోలు చేశారు
రేణుక సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 107 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. నిర్వాసితులకు ఎకరాకు రూ.9.25 లక్షల నుంచి రూ.9.75 లక్షల వరకు ఇచ్చారు. ఫ్యాక్టరీ నిర్మాణం అయితే వారి అర్హత బట్టి ఉద్యోగావకాశాలు వస్తాయి.
– శివరాజ్‌, తహసీల్దార్‌, ఆదిలాబాద్‌ రూరల్‌

మరిన్ని వార్తలు