పండుగ రోజున యువకుడి తీవ్ర విషాదం!

14 Nov, 2023 07:44 IST|Sakshi

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి..

పెంబిలో ఘటన!

సాక్షి, ఆదిలాబాద్‌: దీపావళి రోజున విషాదం నెలకొంది. మొక్కజొన్న పంటకు నీళ్లు పట్టేందుకు వెళ్లిన యువకుడు విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు. పెంబి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రానికి చెందిన ఈర్ల పోసాని–నర్సయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఈర్ల రంజిత్‌ (23) దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండునెలల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. పెళ్లి నిశ్చయమైంది.

త్వరలో పెళ్లి జరగాల్సి ఉంది. గ్రామ సమీపంలో తన తండ్రికి ఉన్న మొక్కజొన్న పంటకు నీళ్లు పట్టేందుకు ఆదివారం ఉదయం 6 గంటలకు వెళ్లాడు. ఉదయం 10 గంటల అవుతున్నా ఇంటికి రాలేదు. తండ్రి అక్కడికి వెళ్లి చూడగా.. విద్యుత్‌ మోటర్‌ వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. పెళ్లిపీటలపై ఎక్కాల్సిన కొడుకు కానరానిలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రజినీకాంత్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు