‘బాణీ’ అదే...‘వాణి’ వేరే..! పార్టీల ప్రచారంలో మార్మోగుతున్న ‘రామక్క పాట’

16 Nov, 2023 09:57 IST|Sakshi

అన్ని ప్రచారంలో మార్మోగుతున్న ‘రామక్క పాట’

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈ క్రమంలో అందరి దృష్టిని మాత్రం ఓ పాట ఆకర్షిస్తోంది. అన్ని పార్టీల వారికీ అదేపాట అక్కెరకొస్తోంది. ఆ పాట పల్లవి మాత్రం ఒక్కటే. కానీ సరిగ్గా వింటే అందులో ఉన్న పదాలు మాత్రం ఆయా పార్టీలకు చెందినవిగా ఉంటాయి.. శ్ఙ్రీనడువు నడువు నడవవే రామక్క.. కలిసి నడుము కట్టవే రామక్క...! శ్రీశ్రీ అంటూ హోరెత్తుతున్న ఈ పాటను మొదట గులాబీ పార్టీ బీఆర్‌ఎస్‌ రూపొందించింది.

అయితే ఈ పాట జనంలోకి బాగా కనెక్ట్‌ కావడంతో ఇదే పల్లవి, ఇదే బాణీతో హస్తం పార్టీ, కమలం పార్టీలు కూడా ఆ చరణాలను మార్చి ఆ పాటకు తమ పార్టీలకు అనుగుణంగా పదాలను కూర్చి సరికొత్తగా పాటల్ని రూపొందించాయి. ఎన్నికల సమయం కావడంతో అన్ని పార్టీల ప్రచార రథాలలోని మైకుల్లో ఈ పాటలు మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో పార్టీల వారీగా దరువులు కొనసాగుతుండగా ఇక ఈ శ్ఙ్రీరామక్క పాటశ్రీశ్రీ వీధి వీధిలో మార్మోగిపోతోంది. ఎన్నికల ప్రచార సమయం కావడంతో ఈ పాట వినిపించగానే జాగ్రత్తగా వింటున్నారు.

ఈ పాట ఏ పార్టీకి చెందినదో గుర్తిస్తున్నారు. ఆయా పార్టీల వారు కూడా తమ ప్రచార రథంలో తమ పార్టీకి బదులు ఎదుటి పార్టీ పాటను పెట్టి అవకాశం ఉండడంతో జాగ్రత్త వహిస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన హామీలు, పథకాలు, అభ్యర్థుల గుణగణాలను వర్ణిస్తూ ఇదే పల్లవితో కూడిన పాట అదే బాణీలో ప్రచారంలో అన్ని పార్టీలకు మార్మోగిపోతుండడం గమనార్హం. ఇక కొంతమంది నాయకులు అన్ని పార్టీలకు తమ గాత్రాన్ని అందిస్తుండడంతో పాటను జాగ్రత్తగా వింటే గాని ఏ పార్టీకి చెందినదో తేల్చుకోలేక పోతున్నారు.

శ్రోతలైన ఓటర్లు ఇక ఆయా పార్టీల నాయకులు తమ ప్రచారం కోసం లేదా పార్టీ బహిరంగ సభలు, మీటింగ్‌ల కోసం కూలీ లెక్కన జనాన్ని తరలిస్తుండడంతో ఒకరోజు ఈ పార్టీ కండువా వేసుకొని స్టెప్పులు ఇస్తే.. మరోరోజు మరోపార్టీ పాటకి డ్యాన్సులు వేస్తున్నారు. ఇక కూలీ కూడా అధికంగా ఉండడంతో పాటు భోజన సదుపాయం కూడా ఆయా రాజకీయ పార్టీల నాయకులు అందిస్తున్నారు. సభలు, సమావేశాలు, బహిరంగ సభలకు వెళ్లే దినసరి కూలీల వారికి ఇది ఉపాధి అవకాశంగా మారిందని అంటున్నారు.
ఇవి చదవండి: ఆదివాసీ బిడ్డ అశోక్‌ను ఎందుకు మార్చామంటే..? : రేవంత్‌రెడ్డి

మరిన్ని వార్తలు