నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

16 Nov, 2023 06:20 IST|Sakshi
మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకుడు గణేశ్‌ బాపూరావు పాటిల్‌

కైలాస్‌నగర్‌: ప్రచారంలో భాగంగా నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తప్పవని ఎన్నికల పరిశీలకులు గణేశ్‌ బాపూరా వు పాటిల్‌ హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఈసీ నిబంధనలపై పోలీస్‌ పరిశీలకులు అశోక్‌ గోయల్‌, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా సహకారం అందించాలన్నారు. అభ్యర్థులు ప్రచారం కోసం గోడలపై రాతలు, పోస్టర్లు, బ్యానర్లు, సభలు, సమావేశాలు, వాహన ర్యాలీలకు రిటర్నింగ్‌ అధికారి అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. దినపత్రికలు, వివిధ న్యూస్‌చానల్స్‌, సోషల్‌ మీడియాలో ప్రకటనల కోసం మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీ ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను సీ–విజిల్‌ యాప్‌ ద్వారా ఫొటో, వీడియోలు అప్‌లోడ్‌ చేసినట్లయితే, ఆ ఫిర్యాదుపై వంద నిమిషాల్లో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రచారానికి సంబంధించి సువిధ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతి పొందవచ్చన్నారు. అనంతరం పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన సందేహాలను కలెక్టర్‌, పరిశీలకులు నివృత్తి చేశారు. సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్‌ వికాస్‌ మహతో, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల పరిశీలకుడు గణేశ్‌ బాపూరావు పాటిల్‌

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

మరిన్ని వార్తలు