-

గంజాయి ప్రత్యామ్నాయ సాగుకు ప్రోత్సాహం

28 Mar, 2023 01:10 IST|Sakshi
జూమ్‌ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌
● రూ.15కోట్లతో ప్రతిపాదనలు ● పోలీసులు, వ్యవసాయ అనుబంధ కమిటీల ఏర్పాటు ● కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

సాక్షి,పాడేరు: జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. గంజాయి సాగు నిర్మూలన,ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబంధించి పోలీసు,రెవెన్యూ,వ్యవసాయ,ఉద్యానవనశాఖలు, డ్వామా అధికారులతో సోమవారం కలెక్టర్‌ జూమ్‌ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.15కోట్లతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికలు రూపొందించామని, ఈమేరకు పోలీసు,రెవెన్యూ,వ్యవసాయ,ఉద్యానవన,డ్వామా సిబ్బందితో అనుబంధ కమిటీలు వేస్తున్నామని చెప్పారు. ప్రతి మండలానికి రూ.50లక్షల నుంచి రూ.కోటి వ్యయంతో ప్రతిపాదనలు పంపాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సాగుకు అనుకూలంగా ఉన్న వాణిజ్య పంటలతో పాటు జీడిమామిడి, పండ్ల జాతుల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గంజాయికి ప్రత్యామ్నాయ పంటల సాగుకు జాతీయ ఉపాఽధి హామీ పథకానికి అనుసంధానిస్తామని చెప్పారు. గంజాయి సాగు మానేసిన గిరిజనులు,లొంగిపోయిన మావోయిస్టులు,మిలీషియా సభ్యులు, మావోయిస్టుల బాధితులు, పీవీటీజీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎస్పీ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ వివిధ అంచనాల ప్రకారం జిల్లాలో 13వేల ఎకరాల్లో గంజాయి సాగులో ఉందని,అందరి సహకారంతో 50శాతం పైగా గంజాయి తోటలను పోలీసుశాఖ నాశనం చేసిందన్నారు.ఆపరేషన్‌ పరివర్తన కార్యక్రమం గురించి గిరిజన గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో విజయవంతమైందన్నారు. ప్రత్యామ్నామ పంటల సాగుకు గిరిజనులకు పోలీసుశాఖ అన్ని విధాల సహకరిస్తుందన్నారు. ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ మాట్లాడుతూ లక్షకు పైగా ఎకరాలకు అటవీ హక్కుల చట్టం కింద భూమి హక్కులు కల్పించామని,ఆయా భూముల్లోను వ్యవసాయ అభివృద్ధి, గ్రామాల్లో గంజాయికి ప్రత్నామ్నాయంగా పంటల సాగుకు పూర్తిస్థాయిలో ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ, రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే, వ్యవసాయాఽధికారి నందు,డ్వామా పీడీ రమేష్‌రామన్‌, ఉద్యానవన శాఽఖాధికారి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పక్కాగా క్షయ నిర్ధారణ పరీక్షలు

హుకుంపేట: క్షయ నిర్ధారణ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. స్థానిక పీహెచ్‌సీలో ఐసీఎంఆర్‌, గీతం మెడికల్‌ కళాశాల సంయుక్తంగా అందజేసిన రూ.7లక్షల విలువైన క్షయ నిర్ధారణ యంత్ర పరికరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ రోగులకు మెరుగైన వైద్యం, పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఆరోగ్య, సంక్షేమ పథకాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి టి.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ వచ్చే నెల 1వ తేదీ నుంచి హుకుంపేట, పాడేరు, జి.మాడుగుల మండలాల్లో క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ గాయత్రి , గీతం మెడికల్‌ కళాశాల అధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డాక్టర్‌ సాయికుమార్‌, డాక్టర్‌ శాంతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు