నిర్వాసితులందరికీ పరిహారం

28 Mar, 2023 01:10 IST|Sakshi
చింతూరు గ్రామసభలో మాట్లాడుతున్న స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విక్టర్‌బాబు
స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విక్టర్‌బాబు

చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులవుతున్న వారందరికీ పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చింతూరు యూనిట్‌ పోలవరం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విక్టర్‌బాబు తెలిపారు. పోలవరం పునరావాసం, పరిహారం(ఆర్‌అండ్‌ఆర్‌)పై సోమవారం చింతూరులో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గోదావరి వరద ముంపునకు గురవుతున్న చింతూరును ప్రాధాన్యతా క్రమంలో తొలిదశలో చేర్చి 1,445 గృహాలను, 1,918 కుటుంబాలను అర్హులుగా నమోదు చేసినట్టు చెప్పారు. ఇంకా గృహాలు, కుటుంబాలు ముంపు జాబితాలో నమోదు కాకుంటే తమకు దరఖాస్తులు ఇవ్వాలని, వాటిని కూడా నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటమన్నారు. నిర్వాసిత గిరిజనులకు ఎటపాక మండలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు సమీపంలోనే వ్యవసాయ భూమి కూడా అందచేయనున్నట్టు ఆయన తెలిపారు. గిరిజనేతరులకు ఏలూరు జిల్లా తాడ్వాయిలో ఇంటిస్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని, స్థలం, ఇల్లు వద్దంటే నగదు అందచేస్తామని ఆయన తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారందరినీ ముంపు జాబితాలో నమోదు చేస్తున్నామని, ప్రభుత్వం నిర్ణయించే కటాఫ్‌ తేదీ ఆధారంగా వారికి పరిహారం అందుతుందని ఎస్డీసీ చెప్పారు. గృహాలు, పేర్లు, ఇతర మార్పులుంటే నిర్వాసితులు ఆందోళన చెందకుండా దరఖాస్తులు చేసే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన తెలిపారు. తమకు అందించే పరిహారం, ఇంటిస్థలం విస్తీర్ణం, 18 ఏళ్లు నిండిన వారికి పరిహారమెంత అనే దానిపై స్పష్టత ఇవ్వాలని నిర్వాసితులు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ను కోరారు. గ్రామసభ సందర్భంగా ఆర్‌అండ్‌ఆర్‌లో నమోదైన కుటుంబాల వివరాలను వలంటీర్లు క్లస్టర్ల వారీగా చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మేడేపల్లి సుధాకర్‌, సర్పంచ్‌ కారం కన్నారావు, తహసీల్దార్‌ సాయికృష్ణ, ఎంపీడీవో రవిబాబు, కార్యదర్శి ప్రసాదరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు