మారేడుమిల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మంగళవారం కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మారేడుమిల్లి ఎస్సై రాము వివరాల ప్రకారం.. మండలంలోని తాడేపల్లి పంచాయతీ పరిధి కొడవడిలంక గ్రామానికి చెందిన కత్తుల శ్రీనివాసు రెడ్డి (32), డివికోట గ్రామానికి చెందిన తుంబుడు మంగిరెడ్డి సోమవారం మారేడుమిల్లికి ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా రంపచోడవరం రహదారిలోని టేక్ ప్లాంటేషన్ వద్ద చింతూరు వైపు వెళ్తున్న మినీ వ్యాను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇరువురిని తొలుత రంపచోడవరం, తర్వాత రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్య సేవల కోసం కాకినాడ జీజీహెచ్‌లో చేర్పించగా, చికిత్స పొందుతూ శ్రీనివాసు రెడ్డి మృతి చెందాడు.