-

మహిళలకు రూ.40 కోట్ల రుణాలు

29 Mar, 2023 01:24 IST|Sakshi
వెలుగు సిబ్బందికి సూచనలు ఇస్తున్న సీ్త్రనిధి ఏజీఎం కామరాజు
● మంజూరు చేయాలన్నది వచ్చే ఆర్థిక సంవత్సర లక్ష్యం ● సీ్త్రనిధి ఏజీఎం కామరాజు

రాజవొమ్మంగి: వచ్చే ఆర్థికసంవత్సరంలో జిల్లాలోని మహిళా స్వయం సహాయ గ్రూపు సభ్యులకు రూ.40 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు సీ్త్రనిధి ఏజీఎం పి.కామరాజు తెలిపారు. కేవలం 90పైసల వడ్డీతో అందజేస్తున్న ఈ రుణాలను మహిళలు తమ జీవనోపాధులను మెరుగుపరచుకోడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని తెలిపారు. స్థానిక సీ్త్రశక్తి భవనం సమావేశం హాలులో వీవోఏలు, సీసీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు తీసుకొన్న రుణాలు ఎన్‌పీఏ (నాన్‌ ఫెర్ఫార్మెన్స్‌ అసెట్స్‌) కాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా వీవోఏలు, సీసీలు, ఏపీఎంలదేనని చెప్పారు. రుణబకాయిలు ఉన్న క్లస్టర్లలోని రికవరీ శాతం పడిపోయిన గ్రూపులకు చెందిన వివరాలు సేకరించారు. బయోమెట్రిక్‌ ద్వారానే సీ్త్రనిధి రుణం మంజూరు చేస్తున్నామని, దీని వల్ల అవకతవకలకు అవకాశం లేదన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది ఇచ్చిన సీ్త్రనిధి రుణాలకు సంబంధించి దాదాపు రూ.3.64 కోట్ల బకాయిలు పేరుకుపోగా కేవలం నెల వ్యవధిలో ఆ మొత్తాన్ని రూ.99 లక్షలకు తగ్గించగలిగామని చెప్పారు. రంపచోడవరం డివిజన్‌కు చెందిన అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం మండలాల్లోనే రికవరీ శాతం బాగా తక్కువగా ఉందని చెప్పారు. జిల్లాలో దాదాపు 11వేల మహిళాగ్రూపులు ఉండగా ఒక్కో గ్రూపులో కనీసం ఐదుగురికి రూ.50 వేల చొప్పున సీ్త్రశక్తి రుణాలు ఇస్తున్నామన్నారు. ఈ మొత్తాన్ని లబ్ధిదారులు 24 నెలల్లో నెలకు రూ.2,500 చొప్పున వడ్డీతో సహా చెల్లించాలని, అప్పు తీరిన తరువాత వడ్డీ రాయితీ లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. మండలానికి రూ.2 కోట్ల చొప్పున సీ్త్రనిధి రుణాల మంజూరుకు ఏర్పాట్లు చేశామన్నారు. సీ్త్రనిధి మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఏపీఎం ఆదినారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు