డ్రోన్‌ విధ్వంసక వ్యవస్థ త్వరలోనే సైన్యానికి..

26 Jul, 2021 03:06 IST|Sakshi

రక్షణ రంగంలో అగ్రరాజ్యాలకు దీటుగా భారత్‌ అభివృద్ధి

శరవేగంగా నాగాయలంక క్షిపణి ప్రయోగ కేంద్రం పనులు

డీఆర్‌డీఓ చైర్మన్‌ జి. సతీశ్‌రెడ్డి

భారత సైన్యం, ఇతర భద్రతా దళాలకు డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి రానుంది. డ్రోన్లను గుర్తించడం, జామ్‌ చేయడం, ధ్వంసం చేయడం కోసం రూపొందించిన పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రదర్శించాం. ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌కు అందించాం. మరికొన్ని పరిశ్రమలకు కూడా త్వరలో అందించి వాటి ద్వారా డ్రోన్‌ విధ్వంసక వ్యవస్థ ఉత్పత్తిని చేపడతాం. 

సాక్షి, అమరావతి: శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు, అసాంఘిక శక్తులు ప్రయోగించే డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే పరిజ్ఞానాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఇప్పటికే విజయవంతంగా అభివృద్ధి చేసిందని సంస్థ చైర్మన్‌ జి. సతీశ్‌రెడ్డి వెల్లడించారు. రక్షణ రంగంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రరాజ్యాలకు దీటుగా అభివృద్ధి సాధిస్తోందని ఆయన చెప్పారు. భారత సైన్యం, ఇతర భద్రతా దళాలకు ఈ వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రోన్‌ విధ్వంసక వ్యవస్థతోపాటు రక్షణ రంగంలో భారత్‌ ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదుగుతున్న తీరును ఇలా వివరించారు.. 

►డ్రోన్లను గుర్తించడం, జామ్‌ చేయడం, ధ్వంసం చేయడం కోసం రూపొందించిన పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రదర్శించాం. 

►ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌కు అందించాం. మరికొన్ని పరిశ్రమలకు కూడా త్వరలో అందించి వాటి ద్వారా డ్రోన్‌ విధ్వంసక వ్యవస్థ ఉత్పత్తిని చేపడతాం. 

►టీటీడీతో సహా ఎవరైనా సరే ఆ పరిశ్రమల నుంచి డ్రోన్‌ విధ్వంసక టెక్నాలజీని కొనుగోలు చేసి అవసరమైనచోట్ల నెలకొల్పుకోవచ్చు.  

టాప్‌ ఫైవ్‌లో భారత్‌ 
►రక్షణ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించి ప్రపంచంలోనే మొదటి ఐదు అగ్రరాజ్యాల జాబితాలో స్థానం సాధించింది.  
►బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ కలిగి ఉన్న నాలుగు దేశాల్లో భారత్‌ ఒకటి.  
►అత్యాధునిక తేజస్‌ యుద్ధ విమానాలను రూపొందించిన ఆరు దేశాల్లో మన దేశం ఉంది.  
►అణు ట్యాంకర్లు కలిగిన ఏడు దేశాల్లో భారత్‌ ఉంది. 
►క్షిపణి విధ్వంసకర వ్యవస్థను అభివృద్ధి చేసిన ఆరు దేశాల్లో భారత్‌కు చోటు దక్కింది.  
►ఉపగ్రహాలను న్యూట్రలైజ్‌ చేసి ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగిన నాలుగు దేశాల్లో భారత్‌ కూడా ఉండటం గర్వకారణం.  
►ప్రపంచంలోనే అత్యంత దూరంలోని అంటే 48 వేల కి.మీ. వరకు షెల్స్‌ ప్రయోగించే 155 ఎంఎం గన్‌ను రూపొందించాం.  
►దేశంలో 2 వేల ప్రధాన పరిశ్రమలతోపాటు మొత్తం 11వేల పరిశ్రమలు రక్షణ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి.  
►రాబోయే ఐదారేళ్లలో రక్షణ రంగంలో దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచడం.. అగ్రరాజ్యాలకు దీటుగా నిలబడాలన్నదే ప్రస్తుత లక్ష్యం. 
►కృష్ణాజిల్లాలోని నాగాయలంక క్షిపణి ప్రయోగ కేంద్రం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.  

కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం 
దేశంలో కరోనా మూడో వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం, డీఆర్‌డీఓ పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని సతీశ్‌రెడ్డి చెప్పారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతి జిల్లాలో రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లు నెలకొల్పుతుండటంతోపాటు లిక్విడ్‌ ఆక్సిజన్‌ కూడా అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ట్యాంకర్లను సిద్ధంచేస్తున్నట్లు చెప్పారు. కరోనాను అరికట్టేందుకు మొత్తం 75 రకాల ఉత్పత్తులను కనిపెట్టడంతోపాటు 190 రకాల పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు.   

మరిన్ని వార్తలు