అమ్మా.. ఎలా ఉన్నారు? మీవారు ఇంటికి సక్రమంగా వస్తున్నారా..

22 Mar, 2023 02:28 IST|Sakshi
మద్యానికి దూరంగా ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకుంటున్న జేసీ కల్పన

 అనకాపల్లి: అమ్మా.. ఎలా ఉన్నారు? మీవారు ఇంటికి సక్రమంగా వస్తున్నారా.. మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా.. అంటూ జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి పలకరించారు. మద్యం వ్యసనం మాన్పించేందుకు జేసీ ‘విముక్తి’ అనే ప్రాజెక్టును మునగపాక మండలంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మద్యం విడిచిపెట్టిన ఇద్దరు వ్యక్తులు పాటిపల్లి గ్రామంలో ఉన్నారు. భూముల రీసర్వే సమీక్ష కోసం మంగళవారం మండలానికి వచ్చిన జేసీ.. పాటిపల్లిలో ఆ ఇద్దరు వ్యక్తుల ఇంటికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

మద్యం మానేశాక వారి ఇంటి పెద్దలో వచ్చిన మార్పు, ఇప్పటికీ అదే పరివర్తన కొనసాగుతోందా.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల్ని పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారింట్లో ఫొటో ఆల్బమ్‌ చూస్తూ పాత జ్ఞాపకాల గురించి వారితో ముచ్చటించారు. ‘విముక్తి’ పైలట్‌ ప్రాజెక్టు విజయవంతానికి కృషి చేసిన ఏఎన్‌ఎం సుజాతను ఈ సందర్భంగా జేసీ అభినందించారు. ఓ పెద్ద కూతురిలా తమ ఇంటికి వచ్చి అంత పెద్ద ఐఏఎస్‌ అధికారి తమ మంచి చెడ్డలను వాకబు చేయడంతో ఆ ఇంటివారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

మరిన్ని వార్తలు