‘లెక్క’కు మించిన సాహిత్య మక్కువ

23 Mar, 2023 01:16 IST|Sakshi
రాజశ్రీ అవార్డును ప్రభుత్వ విప్‌ బూడి చేతుల మీదుగా అందుకుంటున్న అమృతరావు

సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం నేర్పే ఆ ఉపాధ్యాయుడు కవితా సంకలనాలు వెలువరిస్తున్నారు. లెక్కల ఉపాధ్యాయుడే అయినా తెలుగు భాషపై మక్కువతో రచనలు కొనసాగిస్తున్నారు. అమృతం లాంటి కవిత్వాన్ని వెలువరిస్తూ సార్థకనామధేయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు ఎ.కోడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న జుంజూరి అమృతరావు. వృత్తి రీత్యా లెక్కలు బోధిస్తున్నా... ప్రవృత్తి రీత్యా సాహిత్య రంగంలో కృషి చేస్తూ మన్ననలు పొందుతున్నారు.

కె.కోటపాడు : ఎ.కోడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న జుంజూరి అమృతరావు చిన్నప్పటి నుంచే సాహిత్యంపై ఉన్న మక్కువతో రచనలు చేస్తూ అవార్డులు, ప్రతిభా పురస్కారాలను పొందుతున్నారు.

తెలుగు మాస్టారు స్ఫూర్తితో..

పెదబయలు రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదివిన అమృతరావును అక్కడి తెలుగు మాస్టారు డాక్టరు మురళీకృష్ణ ప్రసంగాలు, ఆయన కవితలు ఆకర్షించాయి. దీంతో అప్పటి నుంచి తెలుగు భాష, సాహిత్యంపై ఆసక్తి చూపిన అమృతరావు రచనలు కొనసాగిస్తున్నారు.

సేవా కార్యక్రమాలు

ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్నా అమృతరావు సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురి మన్నలను పొందుతున్నారు. పేద విద్యార్థులకు అవసరమైన ఆర్థికసాయాన్ని అందిస్తున్నారు. కరోనా సమయంలో పోలీసులు, వైద్య సిబ్బందితో పాటు పాదచారులకు భోజనాలు, మంచినీరు, కూరగాయలను తన సొంత నిధులతో సమకూర్చారు.

ప్రశంసలు, పురస్కారాలు

●స్విట్జ్జర్లాండ్‌, జెనీవాకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పీస్‌ సంస్థ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

●108 వచన కవితలను రాసి 2021లో మంచిర్యాలకు చెందిన అఖిల భారత సాహిత్య పరిషత్‌ నిర్వహించిన వచన కవితల పోటీల్లో ప్రత్యేక ప్రశంసతోపాటు రాజశ్రీ బిరుదు పొందారు. ఈ ప్రశంసా పత్రాన్ని ఎ.కోడూరు పాఠశాలలో ప్రస్తుత డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చేతుల మీదుగా అమృతరావు అందుకున్నారు.

●అఖిల భారత సాహిత్య పరిషత్‌ వారు విజయదశమిపై నిర్వహించిన కార్యక్రమంలో ద్వితీయ స్థానం లభించింది.

●నెల్లూరుకు చెందిన గోవిందరాజులు సీతాదేవి సాహిత్య వేదిక నిర్వహించిన కవితా పోటీల్లో ప్రఽథమస్థానం లభించింది.

●హైదరాబాద్‌ ఉస్మానియా తెలుగు రచయితల సంఘం వారు గుర్రం జాషువాపై నిర్వహించిన కవితల పోటీల్లో, రాజమండ్రిలో గోదావరి రచయితల సంఘం వారు అంతర్జాతీయ తపాలా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవితా పోటీల్లో ప్రశంసలు పొందారు.

●అమృతరావు రాసిన కవితలు బుక్‌ ఆఫ్‌ థండర్‌–20 పుస్తకంలోను, గాంధీ జయంతి కవితా సంకలనంలో చోటు దక్కించుకున్నాయి.

●సమాజ సేవలో ఉన్న కవులకు, రచయితలకు విశాఖపట్నంలో ఈ ఏడాది ఆదరణ వెల్పేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఇచ్చిన అవార్డుల ప్రదానోత్సవంలో అమృతరావుకు విశిష్ట సేవారత్న పురస్కారం లభించింది.

చిన్నప్పటి నుంచి ఆసక్తి

విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యంపై మక్కువ ఏర్పడింది. తెలుగు ఉపాధ్యాయుడు మురళీకృష్ణ స్ఫూర్తితోనే కవితలపై ఇష్టం పెరిగింది. గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా ఖాళీ సమయాల్లో కవితలు రాయడం అవాటుగా మారింది.

–జుంజూరి అమృతరావు, ఉపాధ్యాయుడు, ఎ.కోడూరు.

రచనా వ్యాసంగంతో పాటు విరివిగా సేవా కార్యక్రమాలు

ప్రశంసలు అందుకుంటున్న

గణిత ఉపాధ్యాయుడు అమృతరావు

మరిన్ని వార్తలు