ముగిసిన ఉమ్మడి ఏపీ ద్వితీయ ఆహ్వాన నాటిక పోటీలు

23 Mar, 2023 01:16 IST|Sakshi
కొత్తపరిమళం నాటికలో సరిహద్దులో ఆర్మీ సైనికులు

అనకాపల్లి టౌన్‌: స్థానిక వి.వి.రమణ రైతుభారతి ఓపెన్‌ ఆడిటోరియంలో జ్యోతిసరళ స్మారక కళా పరిషత్‌, 1975 ఎంహెచ్‌ స్కూల్‌ పూర్వవిద్యార్థుల సహకారంతో నిర్వహించిన ఉమ్మడి ఏపీ ద్వితీయ ఆహ్వాన నాటిక పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ పరిషత్‌ ఏర్పాటు ద్వారా కళాకారులకు జీవనోపాధి కల్పిస్తున్న కళా పరిషత్‌ కార్యదర్శి పి.సిహెచ్‌.నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

ఆకట్టుకున్న ‘కొత్తపరిమళం’

శ్రీకాకుళం జిల్లా బొరివంకకు చెందిన శార్వాణి గిరిజన సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శించిన కొత్త పరిమళం నాటిక ఆద్యంతం ఆలోచింపజేసింది. ఇండియా–పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో యుద్ధ భయంతో ప్రజలు అల్లాడిపోతుంటే.. మరో పక్క మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతుంది. జాతి, మతద్వేషాలతో దేశాలు రగిలిపోతున్న నేపథ్యంలో వాటి మధ్య నలిగిపోతున్న సరిహద్దు ప్రజల జీవితాలను ఈ నాటికలో ఆవిష్కరించారు. ఈ నాటికకు కథ కాట్రేకుల శ్రీనివాసరావు అందించగా కె.కె.ఎల్‌.స్వామి దర్శకత్వం వహించారు. పిరియా చలపతి, శోభన్‌బాబు, చలం తదితరులు తన నటనతో నాటకాన్ని రక్తికట్టించారు.

ఉత్కంఠభరితంగా ‘పక్కింటి మొగుడు’

పండు క్రియేషన్స్‌ కొప్పోలు వారిచే ప్రదర్శించిన పక్కింటి మొగుడు నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. భార్యాభర్తల సఖ్యతగా ఉంటేనే తన ఆస్తి మనుమలకు దక్కుతుందంటూ ఓ తాతా, బామ్మ వీలునామాలో చూపిన రూ.2 కోట్ల ఆస్తిని వారికివ్వడానికి ఓ లాయర్‌ వస్తాడు. అప్పటి నుంచి జరిగిన సన్నివేశాలు చాలా ఆసక్తిగా సాగాయి.

మరిన్ని వార్తలు