శోభ నిండుగా.. శుభాలు మెండుగా..

23 Mar, 2023 01:16 IST|Sakshi

శుభకృత్‌ శుభమంటూ సెలవు తీసుకుంది. శోభకృత్‌ శోభాయమానంగా మొదలైంది. కొత్త సంవత్సరం బాగుండాలని భగవంతుడిని ప్రార్థించి, ఉగాది పచ్చడి రుచి చూసి, పంచాంగ శ్రవణం చేసి, తెలుగువారు రోజంతా సంప్రదాయబద్ధంగా గడిపారు. పలువురు ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఉపమాక వెంకన్న ఆలయం భక్తుల తాకిడితో కిటకిటలాడింది. సింహాద్రి అప్పన్న కల్యాణోత్సవాలకు సంవత్సరాది రోజున పెళ్లిరాట వేశారు. కలెక్టరేట్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో కలెక్టర్‌ పలువురు వేదపండితులను సన్మానించారు.

అప్పన్న పెళ్లికొడుకాయెనే

రుత్వికులను సత్కరిస్తున్న కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి

తుమ్మపాల: కలెక్టరేట్‌లో బుధవారం శోభకృత్‌ నామసంవత్సర ఉగాది పర్వదినం ఘనంగా జరిగింది. కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి వేద పండితులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలు చాలా ఉన్నతమైనవని, ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనమని, జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశం అందులో ఇమిడి ఉందన్నారు.

వేద పండితులు సుదర్శనం నారాయణచార్యులు (యలమంచిలి), వెలపలపల్లి శంకరం (కశింకోట), పేరూరు నారాయణరావు (అనకాపల్లి)లను శాలువాలతో సత్కరించి రూ.10,116 చొప్పున చెక్కు, సన్మాన పత్రాలను అందించారు. ఉగాది పచ్చడిని అందరికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకటరమణ, జిల్లా దేవదాయ అధికారి బి.మహలక్ష్మినగేష్‌ పాల్గొన్నారు.

సింహాచలం: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి పెళ్లిరాట (ఉడుపురాట) ఉత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని పెళ్లికుమారుడిగా అలంకరించి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో సహా ఆలయ ఆస్థాన మండపంలో అధిష్టింపచేశారు. పంచాంగ పఠనాన్ని దేవస్థానం పురోహిత్‌ అలంకారి కరి సీతారామాచార్యులు ఘనంగా నిర్వహించారు. తదుపరి మహిళలు పసుపుకుంకుమలతో పెళ్లిరాటలను తీర్చిదిద్దారు. అనంతరం ఆలయ ఉత్తరద్వారం వద్ద, రాజగోపురం వద్ద, వార్షిక కల్యాణోత్సవం జరిగే నృసింహ మండపంలోను పెళ్లిరాటలను వేశారు. ఏప్రిల్‌ 2న వార్షిక కల్యాణోత్సవం జరగనుంది. దేవస్థానం పూర్వ అనువంశిక ధర్మకర్త పూసపాటి సుధాగజపతిరాజు, దేవస్థానం డిప్యూటీ ఈవో సుజాత, ట్రస్ట్‌బోర్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెళ్లిరాటని పురస్కరించుకుని వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి, గోదాదేవి అలంకరణలో కళాకారులు కనువిందు చేశారు. అలాగే ఆలయ రాజగోపురం వద్ద జరిగిన కోలాటం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.

అప్పన్న ఆదాయం 14, వ్యయం11

శ్రీ శోభకృత్‌నామ సంవత్సరంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి ఆదాయం 14, వ్యయం 11గా పంచాంగం ప్రకారం పురోహిత్‌ అలంకారి కరి సీతారామాచార్యులు పేర్కొన్నారు. స్వాతి నక్షత్రం, తులారాశి వాడైన రశ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామివారికి శుభకృత్‌నామ సంవత్సరంలో వ్యయం కన్నా ఆదాయం మెరుగ్గా ఉందని వివరించారు.

స్వామివారికి తిరుమంజనం నిర్వహించి నూతన వస్త్రాలు అలంకరించిన దృశ్యం, క్యూలో వేచి ఉన్న భక్తులు

నక్కపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక వెంకన్న ఆలయంలో ఉగాదిని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో వెలసిన మూలవిరాట్‌కు తెల్లవారుజామున పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయ శుద్ధి అనంతరం ప్రత్యేక తిరుమంజన కార్యక్రమం జరిగింది. అనంతరం కొండ దిగువన క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి ఆలయంలోను, స్వామివారి ఉత్సవమూర్తులు, ఆండాళ్లమ్మవారి సన్నిధిలో ఉపాలయాల్లో విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులను, గోదాదేవిని, వేణుగోపాలస్వామిని నూతన వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తెలుగు సంవత్సరాది కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున వచ్చారు. సాయంత్రం ప్రముఖ వేదపండితురాలు డాక్టర్‌ వేదాల గాయత్రీదేవి పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని, వర్షాలు సైతం విస్తారంగా కురుస్తాయన్నారు. దేవస్థాన ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్‌, అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు