శుద్ధ జలం

23 Mar, 2023 01:16 IST|Sakshi
అంగన్‌వాడీ కేంద్రాల్లో
● అంగన్‌వాడీ కేంద్రాల్లో శుద్ధ జలం ● మినీ ఆర్వోప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ● శాశ్వత భవనం ఉన్న వాటికి తొలి ప్రాధాన్యం ● జిల్లాలో ఇటీవల 506 చోట్ల ఏర్పాటు ● ఒక్కో ప్లాంట్‌కు రూ.24 వేలు ఖర్చు

అనకాపల్లి రూరల్‌: మాతా, శిశు సంరక్షణలో కీలకంగా సేవలందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు శుద్ధ జలం సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు స్థానికంగా ఉండే బావులు, బోర్లతోపాటు, బాటిల్‌ నీళ్లను చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యతో పాటు పోషకాలతో కూడిన భోజనం వడ్డిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ఇస్తున్నారు. వీటితో పాటు సురక్షిత తాగునీటిని వీరందరికీ అందించడానికి ప్రత్యేకంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మినీ ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షాకాలంలో కలుషిత నీరు తాగకుండా, వేసవిలో తాగునీటి ఇబ్బందుల్లేకుండా జిల్లాలో 506 కేంద్రాల్లో ఇటీవల వీటిని ఏర్పాటు చేశారు. శుద్ధ జలంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కాపాడాలని ఉన్నత స్థాయిలో నిర్ణయించడంతో కేంద్రం సాక్ష్యం పథకం కింద మినీ ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసింది. శాశ్వత భవనాలున్న కేంద్రాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. విడతల వారీగా జిల్లాలో అన్ని కేంద్రాలకు శుద్ధ జలం అందజేయనున్నారు.

తొలివిడతలో సొంత భవనాలున్నచోట..

జిల్లాలో 1908 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో సొంత భవనాల్లో 819, అద్దె భవనాల్లో 662 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఇతర భవనాల్లో 427 కేంద్రాలున్నాయి. మొత్తం 87,327మంది పిల్లలున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పిల్లలు, గర్భిణులకు సురక్షిత నీరు అందించే అవకాశం ఏర్పడిందని సీ్త్ర,శిశు సంక్షేమ అధికారులు చెబుతున్నారు.

ఒక్కోప్లాంట్‌కు రూ.24 వేలు

ఒక్కో ఆర్వోప్లాంట్‌లో 15 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును అమర్చారు. ఇది గంటకు 12 లీటర్ల నీటిని శుద్ధి చేస్తుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో నీటి సదుపాయం ఉంటే నేరుగా పైపులు ఏర్పాటు చేశారు. ఆ సదుపాయం లేని చోటికి నీటిని తెచ్చి ప్లాంట్‌లో పోసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మినీ ఆర్వోప్లాంట్లు ఏర్పాటు బాధ్యతను ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించారు. ఒక్కో ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.24 వేలు ఖర్చవుతున్నట్టు అధికారులు తెలిపారు.

దశలవారీగా..

అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేస్తున్నాం. మొదటి విడతగా సొంత భవనాలున్నచోట ప్లాంట్లు ఏర్పాటు చేశాం. దశలవారీగా మిగతా చోట్ల అమర్చేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. మినీ ఆర్వో ప్లాంట్లతో రక్షిత తాగునీరు అందుబాటులో ఉంటుంది.

–జి.ఉషారాణి, మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి

మరిన్ని వార్తలు