త్వరలో 11 సెంట్రల్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ల ఏర్పాటు

23 Mar, 2023 01:16 IST|Sakshi
అంకంరెడ్డి పార్వతిని సత్కరిస్తున్న డీసీసీబీ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత

నాతవరం : ఉమ్మడి విశాఖపట్నం సెంట్రల్‌ బ్యాంకు వివిధ రుణాల కింద రూ.2 వేల కోట్లకు పైగా టర్నోవర్‌ సాధించిందని డీసీసీబీ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత వెల్లడించారు. డీసీసీబీ డైరెక్టర్‌గా నియమితులైన దివంగత నేత అంకంరెడ్డి జమీలు భార్య అంకంరెడ్డి పార్వతిని నాతవరంలో బుధవారం కలిసి, అభినందించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ డీసీసీబీ ద్వారా రైతులకు కావాల్సిన అన్ని రకాల రుణాలు అందిస్తున్నట్టు తెలిపారు. రైతుల అభీష్టం మేరకు రుణ లక్ష్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలో మరో 11 సెంట్రల్‌ బ్యాంకు బ్రాంచ్‌లను త్వరలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి అదేశాలు వచ్చిన వెంటనే వీటిని ప్రారంభిస్తామన్నారు. దివంగత అంకంరెడ్డి జమీలు ఆశయం మేరకు నాతవరంలో కొత్తగా సెంట్రల్‌ బ్యాంక్‌ బ్రాంచి ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గతంలో కూడా ఆయన విజ్ఞప్తి మేరకు సెంట్రల్‌ బ్యాంక్‌ ఏటీఎం కేంద్రాన్ని నాతవరంలో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కొత్త డైరెక్టర్‌గా నియమితులైన పార్వతి ఈ నెల 27న విశాఖపట్నంలో ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. అదే రోజు డీసీసీబీ పాలకవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి దివంగత నేత జమీలు అందించిన సేవలను పార్టీ ఎప్పుడూ గుర్తుంచుకుని, ఆయన కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ శెట్టి నూకరాజు, నాతవరం ఉప సర్పంచ్‌ కరక అప్పలరాజు, ఎంపీటీసీ సభ్యురాలు కరక రేణుక, మాజీ సర్పంచ్‌ కామిరెడ్డి కిత్తయ్యనాయుడు, వెదురుపల్లి సర్పంచ్‌ కాళ్ల సత్యనారాయణ, వర్తక సంఘం అధ్యక్షుడు తూతిక నాగేశ్వరరావు పాల్గొన్నారు.

27న డీసీసీబీ డైరెక్టర్‌గా అంకంరెడ్డి పార్వతి ప్రమాణ స్వీకారం

మీడియాతో డీసీసీబీ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత

మరిన్ని వార్తలు