రక్షణగోడను ఢీకొని లోయలోకి దూసుకెళ్లిన వాహనం
సంఘటన స్థలంలో ఇద్దరు, ఆస్పత్రిలో మరొకరు మృతి
ప్రాణాలు కోల్పోయిన వారిలో దంపతులు
మృతుల్లో సుబ్బారావు విశాఖలో ఎల్‌ఐసీ డివిజనల్ మేనేజర్
సొంతూరులో గ్రామదేవత ఉత్సవాలకు హాజరైన ఓ కుటుంబం గమ్యానికి చేరుకోకుండానే మృత్యువు దారికాసి కబళించింది. కారు ప్రమాద రూపంలో ముగ్గురి ప్రాణాలను బలిగొంది. అదుపుతప్పి రక్షణగోడను ఢీకొట్టిన కారు లోయలోకి దూసుకుపోయింది.
ఈ ఘటనలో ఇద్దరు సంఘటన స్థలంలోను మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పాడేరు– చోడవరం ప్రధాన రహదారిలోని కోమాలమ్మ తల్లి ఘాట్ మలుపు వద్ద బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
పాడేరు రూరల్ : జిల్లాలోని ముంచంగిపుట్టు మండలం కిలగాడ గ్రామానికి చెందిన చెండా సుబ్బారావు(55), భార్య మహేశ్వరి(50) విశాఖ నగరంలోని పెదవాల్తేరు దరి పోలమాంబ ఆలయానికి సమీపంలోని ఎల్‌ఐసీ క్వార్టర్లలో ఉంటున్నారు. చెండా సుబ్బారావు విశాఖలో ఎల్‌ఐసీ కార్యాలయంలో డివిజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
కిలగాడలోని గంగమ్మతల్లి ఉత్సవాలకు..
స్వగ్రామం కిలగాడలో మంగళవారం జరిగిన గంగమ్మతల్లి పండగకు భార్యాభర్తలు చెండా సుబ్బారావు, మహేశ్వరి విశాఖ నుంచి కారులో వచ్చారు. పండగ ముగియడంతో బుధవారం సాయంత్రం భార్యభర్తలు సుబ్బారావు, మహేశ్వరితోపాటు బంధువు సమరెడ్డి పూర్ణచంద్రరావు కారులో విశాఖ బయలుదేరారు. పాడేరు– చోడవరం ప్రధాన రహదారిలోని కోమాలమ్మ తల్లి ఘాట్ మలుపు వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రక్షణగోడను ఢీకొట్టింది. లోయలోకి దూసుకుపోయింది.
సంఘటన స్థలంలోనే మహేశ్వరితోపాటు కారు డ్రైవర్ కంద్రాపు ఉమామహేశ్వరరెడ్డి తీవ్రంగా గాయపడి మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సుబ్బారావు, సమరెడ్డి పూర్ణచంద్రరావునుఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు బయటకు తీశారు. 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుబ్బారావు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
కారు డ్రైవర్ విశాఖలోని రెడ్డి కంచరపాలెంకు చెందిన వ్యక్తిగా వారు పేర్కొన్నారు. పూర్ణచంద్రరావు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సంఘటన స్థలంలోని మహేశ్వరి, కారు డ్రైవర్ ఉమామహేశ్వరరెడ్డి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సుబ్బారావు, మహేశ్వరికి ఇద్దరు సంతానం ఉన్నారు.