అత్యాశకు పోయి హత్య

23 Sep, 2023 10:54 IST|Sakshi

అతడికి పర్యాటక ప్రదేశాలు చూడటం హాబీ.. వాటితోపాటు స్నేహితులతో జలాసాలు చేయడం అలవాటు.. అవే కొంపముంచాయి. ఇంత విలాస జీవితం గడుపుతున్న అతడి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని, కాజేయాలని ఇద్దరు యువకులు అత్యాశకు పోయి మట్టుబెట్టారు. ఆపై పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్న వారిని చాకచక్యంగా పట్టుకున్నారు.

అనకాపల్లి: మాకవరపాలెం మండలం రామన్నపాలెం వద్ద ఈ నెల 20న జరిగిన ధనిమిరెడ్డి రవి (36)హత్య కేసును పోలీసు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వి వరాలను శుక్రవారం రాత్రి తన కార్యాలయంలో ఏఎస్పీ అదీరాజ్‌సింగ్‌ రాణా వెల్లడించారు. రవి తన స్నేహితుడు సురేష్‌తో కలిసి ఈ నెల 12న విశాఖపట్నం వెళ్లాడు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఆటో డ్రైవర్‌ మలిశెట్టి అరవింద్‌తో విశాఖ నగరంలో టూరిస్టు ప్రదేశాలను చూపించడానికి రూ.2,500కు బేరం కుదుర్చుకున్నాడు. మూడు రోజుల పాటు ముగ్గురు ఎంజాయ్‌ చేశారు. అరవింద్‌కు ఫోన్‌ పే లేకపోవడంతో అతని మిత్రుడు తెప్పల గణేష్‌కు రవి ఫోన్‌ పే ద్వారా డబ్బులు చెల్లించేవాడు. మూడు రోజుల తర్వాత తన స్నేహితుడు సురేష్‌ను కాకినాడలో విడిచిపెట్టి, రవి ఈ నెల 17న నర్సీపట్నం వచ్చి వెంకటాద్రి లాడ్జిలో దిగాడు.

19న అరవింద్‌కు ఫోన్‌ చేసి నర్సీపట్నం రమ్మన్నాడు. అరవింద్‌, అతని స్నేహితుడు గణేష్‌ ఆటోలో అక్కడకు రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. వీరు ముగ్గురు రూమ్‌లో తాగి అర్ధరాత్రి సమయంలో ఆటోలో మాకవరపాలెం వచ్చారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్న రవి వద్ద ఎక్కువ నగదు ఉంటుందని భావించిన నిందితులు అరవింద్‌, గణేష్‌ రవిని హత్య చేసి రోడ్డు పక్కన పొదల్లో పడేసి పరారయ్యారు. కాల్‌ డేటా, సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులిద్దరినీ అరెస్టు చేశామని ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ రమణయ్య, ఎస్సై రామకృష్ణారావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు