ఓట్ల తొలగింపునకు డాక్యుమెంటేషన్‌ తప్పనిసరి

4 Dec, 2023 00:56 IST|Sakshi
దేవరాపల్లి మండల కేంద్రంలో తనిఖీలు చేస్తున్న కలెక్టర్‌ రవి పట్టాన్‌ శెట్టి

సాక్షి, అనకాపల్లి: పక్కా డాక్యుమెంటేషన్‌ ఉంటేనే ఓట్లు తొలగించాలని కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి ఆదేశించారు. స్పెషల్‌ డ్రైవ్‌ సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద జరుగుతున్న ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపు ప్రక్రియను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో మాడుగుల నియోజకవర్గంలోని కె.కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల మండలాల్లో పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి, బీఎల్‌వో రిజిస్టర్‌లను పరిశీలించారు. గ్రామాల్లో 18, 19 సంవత్సరాల యువతీయువకులను గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితాలో తప్పక నమోదు చేయాలన్నారు. వేరొక చోటుకు నివాసం మార్చిన వారిని గురించి క్షుణ్ణంగా విచారించి, చనిపోయిన వారి విషయంలో పక్కాగా పంచనామా నిర్వహించి తొలగింపులు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే పైస్థాయి అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని ఆదేశించారు. బీఎల్‌వోలు సమర్థంగా పనిచేసే విధంగా ఉన్నతాధికారులు వారికి దిశానిర్దేశం చేయాలన్నారు. పర్యటనలో మాడుగుల నియోజకవర్గ ఈఆర్వో, తహసీల్దార్లు, డీటీలు తదితరులు పాల్గొన్నారు.

తోటకూరపాలెంలో జేసీ పరిశీలన

రావికమతం: కొత్త ఓటర్ల నమోదు, తప్పొప్పుల సవరణ ఎలా ఉందో పరిశీలించేందుకు జాయింట్‌ కలెక్టర్‌ జాహ్నవి తోటకూరపాలెంలో పోలింగ్‌ బూత్‌లను ఆదివారం సందర్శించారు. ఆ గ్రామంలోని 103, 104 పోలింగ్‌ బూత్‌లను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆ దిశగా సిబ్బందిని అప్రమత్తం చేయాలని తహసీల్దార్‌ మహేశ్వరరావును ఆదేశించారు.

కలెక్టర్‌ రవి పట్టాన్‌ శెట్టి

మరిన్ని వార్తలు