విలువల తూణీరం తిమ్మారెడ్డి

25 Feb, 2023 08:56 IST|Sakshi
తిమ్మారెడ్డి

నేడు వర్ధంతి సభ, విశిష్ట అతిథిగా హాజరుకానున్న దేవులపల్లి అమర్‌

అనంతపురం కల్చరల్‌: ‘కొంత మంది యువకులు రాబోవు యుగం దూతలు’..అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ..ఏ కొద్దిమంది మాత్రమే సమాజంపై బలమైన ముద్ర వేసుకోగలుగుతారు. పీడిత, తాడిత వర్గాల పక్షాన నిలిచి ప్రభావితం చేయగలుగుతారు. ఆ కోవకు చెందిన రాకెట్ల తిమ్మారెడ్డి అక్షరాన్ని ఆయుధంగా మార్చుకొని ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గమయ్యాడు. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో జన్మించిన ఆయన.. విద్యార్థి దశ నుంచే పోరాటబాట ఎంచుకొని బాధితుల, శ్రామికుల పక్షాన నిలబడ్డాడు. ఎందరో శత్రువులుగా మారినా, చెదరని, బెదరని ధైర్య సాహసాలే ఆయన జనహృదయాల్లో నిలిచేలా చేశాయి.

విలువలనే అక్షరాలుగా మార్చి..

సమాజాన్ని ప్రక్షాళన చేయడానికి పత్రికా రంగానికి మించిన పరిష్కారం మరేది లేదని భావించిన తిమ్మారెడ్డి .. విలువలతో కూడిన జర్నలిజం వైపు దృష్టి సారించాడు. ఆంధ్రప్రభ, విశాలాంధ్ర పత్రికల్లో రిపోర్టర్‌గా, సబ్‌ ఎడిటర్‌గా దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేసి, ఆదర్శ ఆలోచనా విధానాన్ని నేర్పించారు. జర్నలిజానికి కొత్త ఆకర్షణ తీసుకొచ్చిన ఏబీకే ప్రసాద్‌, రామచంద్రమూర్తి, నండూరి పార్థసారథి వంటి వారి శిక్షణలో రాటుదేలారు. అక్షరాన్ని సత్యం వైపు మళ్లించడానికి, నమ్మిన సిద్ధాంతాన్ని ఊపిరి ఉన్నంత వరకు వదలకుండా ఉండడానికి సంఘంతో యుద్ధం చేయాల్సి వచ్చింది. రాయలసీమ సమస్యలకు అద్ధం పట్టే ఆయన రాసిన ఎన్నో విలువైన వ్యాసాలు అతన్ని నిఖార్సయిన జర్నలిస్టుగా మార్చాయి.

ప్రజాకోణమే కొలబద్దగా...

నానాటికి పెరుగుతున్న కుటుంబ సమస్యలు ఓ వైపు పట్టి లాగుతున్నా ప్రజా కోణాన్నే కొలబద్దగా మార్చుకొని వార్తలల్లిన తీరు ఆదర్శ పాత్రికేయుడిగా మార్చింది. మరోవైపు తండ్రిని, సోదరుడిని భూస్వాములు కడతేర్చినా నిర్వేదాన్ని చూపకుండా అగ్నిగుండాలు రగులుతున్నా సత్యం వైపు నిలబడి చిరస్మరణీయుడయ్యారు. నిత్యం ప్రజా సంఘర్షణలో అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడంతో 45 ఏళ్ల ప్రాయంలోనే కన్నుమూశారు. మనిషిగా ఆయన మన మధ్య లేకున్నా ఆయన వదిలి వెళ్లిన విలువలు, చూసిన పోరు బాట తర్వాతి ఎంతో మంది పాత్రికేయులకు మార్గదర్శకాలుగా మారాయి.

నేడు జర్నలిజంపై సదస్సు..

సీనియర్‌ జర్నలిస్టు తిమ్మారెడి వర్ధంతి సందర్భంగా శనివారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని లలితకళా పరిషత్‌లో ‘జర్నలిజం నాడు – నేడు’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. అన్ని పత్రికల జిల్లా జర్నలిస్టులు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సీనియర్‌ జర్నలిస్టు విశ్వనాథ్‌ అధ్యక్షతన జరుగనున్న సదస్సుకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్యతో పాటు జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ విశిష్ట అతిథులుగా విచ్చేస్తున్నారు. అదేవిధంగా తిమ్మారెడ్డి సమకాలికులు కూడా హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు