రాప్తాడురూరల్‌: విద్యాహక్కు.....

6 Mar, 2023 00:44 IST|Sakshi

రాప్తాడురూరల్‌: విద్యాహక్కు చట్టం –2009 కింద ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో 2023–24 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పేద పిల్లలకు 25 శాతం కోటా అడ్మిషన్ల అమలు పటిష్టంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో 811 ప్రైవేట్‌ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో అనంతపురం జిల్లాలో 245 ప్రాథమిక, 210 ప్రాథమికోన్నత పాఠశాలలు, శ్రీసత్యసాయి జిల్లాలో 157 ప్రాథమిక, 199 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రతి ప్రైవేట్‌ పాఠశాలలోనూ అనాథ, దివ్యాంగ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల పిల్లలకు 6 శాతం వెరసి 25 శాతం సీట్లను కేటాయించాలి. ఇందుకు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలు ఉండాలి. అర్బన్‌ పరిధిలోని పాఠశాలల్లో ఒక్కో అడ్మిషన్‌కు రూ.8 వేలు, రూరల్‌ పరిధిలోని పాఠశాలల్లో రూ. 6500 ఫీజును ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే ఆయా పాఠశాలలకు చెల్లిస్తుంది. అయితే మన రాష్ట్రంలో ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా ప్రతి ఏటా ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ప్రభుత్వం అందజేస్తోంది. ప్రైవేట్‌ స్కూళ్లకు ఎంపికై న విద్యార్థులకు ‘అమ్మ ఒడి’ డబ్బులతోనే ఫీజు చెల్లిస్తారు. తక్కిన సొమ్మును విద్యార్థి తల్లి/సంరక్షకుల ఖాతాలో జమ చేస్తారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ రెండు రోజుల క్రితం విడుదలైంది.

కి.మీ పరిధిలోని పాఠశాలలకు ప్రాధాన్యత..

విద్యార్థులు నివాసం ఉండే (ఆధార్‌లో చిరునామా ప్రామాణికం) ప్రాంతంలో కిలోమీటరు పరిధిలో ఉన్న పాఠశాలలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత మూడు కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలకు కేటాయిస్తారు. ప్రతి ఒక్కరికీ తమకు ఫలానా స్కూలే కావాలంటే కుదరదు. వారి ఇళ్లకు సమీపంలోని పాఠశాలలకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రైవేట్‌ పాఠశాలల అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్ని పాఠశాలల్లో అడ్మిషన్లు పొందే వీలుంటుందనేది స్పష్టమవుతుంది.

ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్‌..

ఈ నెల 6 నుంచి 16 వరకు ప్రైవేట్‌ పాఠశాలలు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈనెల 18 నుంచి ఏప్రిల్‌ 7 వరకు అర్హులైన విద్యార్థులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. 9 నుంచి 12 వరకు సచివాలయాల్లో ఉన్న డేటా ద్వారా అర్హులైన విద్యార్థులను గుర్తిస్తారు. 13న లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 15 నుంచి 21 వరకు ఆయా స్కూళ్లకు విద్యార్థుల అడ్మిషన్లను ఖరారు చేస్తారు. మిగులు సీట్లకు 25న రెండోసారి లాటరీ నిర్వహిస్తారు. 26 నుంచి 30 వరకు ఆయా స్కూళ్లలో అడ్మిషన్లు చేయిస్తారు.

సమాజంలోని 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలంతా చదువుకోవాలనే ఉద్దేశంతో 2009 ఆగస్టు 27న కేంద్ర ప్రభుత్వం ‘ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం’ను రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద పిల్లలకు ఒకటో తరగతిలో అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంది. వీరి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఎంతో ఉన్నతమైన ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

విద్యాహక్కు చట్టం అమలుకు కృషి

పేదింటి పిల్లలకు సువర్ణావకాశం

ప్రభుత్వమే ఫీజులు భరిస్తుంది

నేటి నుంచి 16 వరకు వెబ్‌సైట్‌లో ప్రైవేట్‌ స్కూళ్ల రిజిస్ట్రేషన్‌

18 నుంచి ఏప్రిల్‌ 7 వరకు ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తు

ఏప్రిల్‌ 30లోపు ‘ప్రైవేట్‌’లో

అడ్మిషన్ల పూర్తికి చర్యలు

మరిన్ని వార్తలు