ఆడియో మార్చి అభాండాలా..?

14 Mar, 2023 02:30 IST|Sakshi

అనంతపురం: ‘ఒక బీసీ మహిళ మంత్రిగా ఎదగడం ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదు. నేనంటే ఓర్వలేని వారు ఆడియో (వాయిస్‌) మార్చి అభాండాలు వేస్తున్నారు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో టీడీపీ ఉండటం సిగ్గుచేటు’ అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్‌ మండిపడ్డారు. సోమవారం ఆమె కళ్యాణదుర్గంలో మీడియాతో మాట్లాడారు. గతంలో రాష్ట్ర మంత్రి హోదాలో మొట్టమొదటిసారి జిల్లాకు వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షాలు వివాదం సృష్టించాయని గుర్తు చేశారు. తన కాన్వాయ్‌ ట్రాఫిక్‌ వల్ల ఓ చిన్నారి మృతి చెందిందని డ్రామాలకు తెరలేపారన్నారు. అయితే వాస్తవాలు తెలుసుకున్నాక ముక్కున వేలేసుకుని మిన్నకుండిపోయారన్నారు.

నియోజకవర్గంలో ఇటీవల ప్రభుత్వ నిబంధనల మేరకు తన సొంత ఖర్చుతో కొనుగోలు చేసిన భూమిని కూడా కబ్జా అంటూ ఆరోపణలు చేశారన్నారు. తనపై దుష్ప్రచారం చేయడంలో భాగంగానే ప్రస్తుతం కూడా వివాదానికి తెర లేపారన్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా, మెజార్టీపై పార్టీ నాయకులతో చర్చిస్తుండగా వీడియో తీసి.. డబ్బుతో ప్రలోభాలకు తెర లేపారంటూ తన వాయిస్‌ను వక్రీకరించారని మండిపడ్డారు.

టీడీపీ వారు ఇంతటి నీచానికి దిగజారడం సిగ్గుచేటన్నారు. గతంలో ఇదే నియోజకవర్గంలో వాల్మీకి నేత గోళ్ల బాదన్న తన వాదనను వినిపిస్తే అదే టీడీపీ వారు అతన్ని ఏం చేశారో, ఏం జరిగిందో ప్రజలంతా గమనించారన్నారు. ప్రస్తుతం కురుబ సామాజిక వర్గానికి చెందిన తనపై తప్పుడు ప్రచారం చేస్తూ టీడీపీ పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. వెనుకబడిన వారు పదవుల్లో ఉండి ఏదైనా మాట్లాడితే అది నచ్చని కొన్ని చానళ్లు, కొన్ని పత్రికలు బురదజల్లడం పనిగా పెట్టుకున్నాయన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ వ్యవహారంలో రామోజీరావుపై కేసులు కూడా నమోదయ్యాయని, దీని గురించి ఎవరైనా, ఎక్కడైనా మాట్లాడుతున్నారా అంటూ మంత్రి ఘాటుగా ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీకి నష్టం చేకూర్చడమే టీడీపీ, కొన్ని పత్రికల పని అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు