విద్యుత్‌ శాఖకు రూ.5లక్షల నష్టం

20 Mar, 2023 01:16 IST|Sakshi

అనంతపురం టౌన్‌: ఇటీవల ఈదురుగాలులతో జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ శాఖకు రూ.5లక్షల మేర నష్టం వాటిల్లిందని ఎస్‌ఈ సురేంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శింగనమల నియోజకవర్గం పరిధిలోని శింగనమల, నార్పలతోపాటు తాడిపత్రి డివిజన్‌ పరిధిలో 33 కేవీ విద్యుత్‌ స్తంభాలు 25, 11కేవీ స్తంభాలు 74, ఎల్‌టీ లైన్‌ స్తంభాలు 39, రెండు ట్రాన్స్‌ఫార్మర్లు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. స్తంభాలు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు.

డ్యాన్స్‌ పోటీల్లో

‘ఎస్కేయూ’కు ప్రథమ స్థానం

కళ్యాణదుర్గం: బెంగళూరులో జరుగుతున్న ఎన్‌ఎస్‌ఎస్‌ జాతీయ సమైక్యత శిబిరంలో జరిగిన డ్యాన్స్‌ పోటీల్లో ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహించిన ఎస్కేయూ విద్యార్థులు ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. ఈ మేరకు ఆ బృందానికి ఇన్‌చార్జ్‌గా వెళ్లిన కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ పి.ఎల్‌.కాంతారావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 12 విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన విద్యార్థుల బృందాలు ఈ పోటీల్లో పాల్గొనగా.. ఎస్కేయూ విద్యార్థులు అన్నింటా ప్రతిభ చాటుకుని ప్రథమస్థానంలో నిలిచారు. ఇందులో పెనుకొండ ప్రభుత్వ డిగ్రీకళాశాలకు చెందిన సుష్మిత, హిందూపురం బాలయేసు కళాశాలకు చెందిన భార్గవి, సప్తగిరి కళాశాలకు చెందిన నరేష్‌, అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌ విద్యార్థి సాయికుమార్‌, ఎస్కేయూ విద్యార్థి అఫ్రోజ్‌ ఉన్నారు.

రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా విజేత ‘అనంత’

ఉరవకొండ: కర్నూలు జిల్లా నందికొట్కూరు వేదికగా జరిగిన 33వ రాష్ట్ర స్థాయి బాల, బాలికల సెపక్‌తక్రా పోటీల్లో అనంతపురం బాలికల జట్టు విజేతగా నిలిచింది. క్వాటర్స్‌ మ్యాచ్‌లో శ్రీకాకుళంపై, సెమీఫైనల్స్‌లో ప్రకాశం జిల్లాపై వరుస విజయాలు నమోదు చేసిన అనంతపురం బాలికల జట్టు ఫైనల్‌లో కర్నూలు జిల్లా జట్టుపై తలపడింది. మొదటి సెట్‌లో కాస్త తడబడి 19–21 పాయింట్లు సాధించగా.. రెండో సెట్‌లో 21–15 పాయిట్లు, మూడో సెట్‌లో 21–17 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా విజేతలను అభినందిస్తూ ట్రోఫీని కర్నూలు జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జగదీష్‌, జూడో రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్‌, సెపక్‌తక్రా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు అందజేశారు. రాష్ట్ర స్థాయిలో తొలిసారి జిల్లా జట్టును విజేతగా నిలిపిన క్రీడాకారులను ఆ క్రీడా విభాగం జిల్లా చైర్మన్‌ సప్తగిరిమల్లి, అధ్యక్షుడు షాహీన్‌, కోచ్‌లు నాగేంద్ర, వన్నూర్‌స్వామి, ఎర్రిస్వామి, పీడీ మారుతీప్రసాద్‌ అభినందించారు.

బైక్‌ల రిపేరీపై ఉచిత శిక్షణ

అనంతపురం: రూడ్‌సెట్‌ సంస్థలో ఈ నెల 23వ తేదీ నుంచి టూవీలర్‌, మోటార్‌ రీవైండింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు రూడ్‌సెట్‌ డైరెక్టర్‌ ఆర్‌.లోక్‌నాథరెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల్లోపు వయసున్న నిరుద్యోగ యువకులు అర్హులు. ఉచిత శిక్షణతో పాటు భోజన సదుపాయాలు కల్పిస్తారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్‌, రేషన్‌కార్డు నకళ్లతో కూడిన దరఖాస్తును రూడ్‌సెట్‌ సంస్థలో అందజేసి, పేర్లు నమోదు చేసుకోవాలి. పూర్తి సమాచారానికి 08554–255925, 94925 83484, 96188 76060లో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు