‘హవాలా’ డబ్బు దోపిడీ చేయడంలో పేరుమోసిన శ్రీధరన్‌

21 Mar, 2023 02:02 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘హవాలా’ సొమ్మును దోచుకోవడంలో ఆరితేరిన అంతర్రాష్ట్ర ముఠా నేత శ్రీధరన్‌ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. గత నెలలో బెంగళూరు జాతీయ రహదారిపై హవాలా సొమ్ము దోపిడీ జరిగింది. పోలీసులు పక్కా సమాచారంతో ఈ కేసులోని నలుగురు నిందితులను పట్టుకుని, రూ.1.89 కోట్ల సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. అయితే కీలక నేరస్తుడు శ్రీధరన్‌ కోసం ఇప్పుడు ‘అనంత’ పోలీసులు పది మంది రెండు బృందాలుగా ఏర్పడి కేరళకు వెళ్లారు. వీరితో పాటు ఇదివరకే అదుపులోకి తీసుకున్న నలుగురు నిందితులను కూడా వెంటబెట్టుకుని వెళ్లారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోనూ శ్రీధరన్‌పై హవాలా సొమ్ము దోపిడీ కేసులు ఉన్నాయి.

ఇన్‌ఫార్మర్ల వ్యవస్థతోనే...
శ్రీధరన్‌ అంటే దక్షిణాది రాష్ట్రాల్లో హవాలా వ్యాపారం చేసే వారికి తెలియకుండా ఉండదు. వారు ఎంత ఆచితూచి అడుగులు వేసినా శ్రీధరన్‌ నుంచి తప్పిచుకోలేరు. ప్రతి హవాలా వ్యాపారి వద్ద శ్రీధరన్‌ ఇన్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకుంటారు. మూడో కంటికి తెలియకుండా సొమ్ము ఎక్కడికి వెళుతుందో శ్రీధరన్‌కు ఇన్‌ఫార్మర్లు చేరవేస్తారు. దీంతో తక్షణమే వ్యూహం సిద్ధం చేసి తన మనుషులను రంగంలోకి దించుతారు. జాతీయ రహదారుల్లో మాత్రమే పక్కాగా వ్యూహం అమలు చేసి ‘హవాలా’ సొమ్మును దోచుకుని.. పోలీసులకు చిక్కకుండా పారిపోతారు.

రూ.2 కోట్లపైన అయితేనే..

శ్రీధరన్‌ చిన్నా చితకా దోపిడీలు చేయడు. సమాచారం పక్కాగా ఉండాలి. అందులోనూ ‘హవాలా’ సొమ్ము రూ.2 కోట్ల పైన ఉంటేనే రంగంలోకి దిగుతాడు. అధికారిక సొమ్మును ఎవరు తీసుకెళుతున్నా వారి జోలికి వెళ్లడు. ‘హవాలా’ సొమ్ముపై మాత్రమే కన్నేస్తాడు. ఎందుకంటే ఈ సొమ్ము దోచుకుంటే కేసులు నమోదు కావు కాబట్టి. ఒక్కసారి శ్రీధరన్‌ కన్ను పడిందంటే ఆ సొమ్మును దోచుకునే వరకూ వదలడు. నాలుగైదు బృందాలు ఇన్నోవా వాహనాల్లో నిఘావేసి ఏ అర్ధరాత్రో దోచుకెళ్తారు. దోచుకున్న సొమ్ము ఎప్పుడు ఏ వాహనంలో ఎక్కడికి వెళుతుందో పోలీసులు నిఘా వేయనంతగా జాగ్రత్త పడతాడు. ఈ సొమ్మును కోయంబత్తూరు, సేలం, తిరువనంతపురం వంటి ప్రాంతాలకు తరలిస్తారని తెలిసింది.

గట్టి నిఘా

‘హవాలా’ డబ్బు దోపిడీ చేయడంలో పేరుమోసిన శ్రీధరన్‌ను పట్టుకోవడం ఒకరోజుతో అయ్యేది కాదు. కొన్ని రోజుల పాటు పూర్తిస్థాయిలో నిఘా వేయాలి. అదే పద్ధతిలో పనిచేస్తున్నాం. దోపిడీల్లో ఆరితేరిన ఇతన్ని పట్టుకోవడానికి కేరళ పోలీసులూ సాయం చేస్తున్నారు. శ్రీధరన్‌ను అదుపులోకి తీసుకుంటే మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

– ఫక్కీరప్ప, ఎస్పీ

మరిన్ని వార్తలు