‘నువ్వు చనిపోతే ఎలా? అవసరమైతే మీ అత్తనే చంపేద్దాం’

30 Mar, 2023 09:50 IST|Sakshi

అనంతపురం: వైరుతో అత్త గొంతు బిగించి కోడలు హత్య చేసిన ఘటన నగరంలోని ఆజాద్‌నగర్‌లో జరిగింది. వివరాలు.. ఆజాద్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో బాషా, ఉమేరాసుల్తానా దంపతులు నివాసం నివసిస్తున్నారు. వీరి వద్ద తల్లిదండ్రులు సర్దార్‌భీ (57), ఇస్మాయిల్‌ ఉంటున్నారు. బాషా స్థానిక మార్కెట్‌ యార్డులో వాచ్‌మెన్‌గా పని చేస్తుండగా, సుల్తానా ఇంటి వద్దే ఉంటోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలుండగా, సర్దార్‌భీ కుమార్తెల పిల్లలను కూడా తన వద్దే ఉంచుకుంది. తన పిల్లలతో పాటు ఆడబిడ్డ పిల్లలను కూడా చూసుకోవడం సుల్తానాకు బరువుగా ఉండేది. అత్త ప్రతి విషయానికి తనపై గట్టిగా అరవడం, మందలిస్తుండంతో కుమిలిపోయేది. ఈ క్రమంలోనే తన ఇబ్బందులను గుంతకల్లులో ఉంటున్న సోదరుడు వలీకి ఫోన్‌ చేసి చెప్పింది.

అత్తింట్లో కాపురం చేయడం తన వల్ల కాదని, చనిపోతానని వాపోయింది. చెల్లెలు కష్టాన్ని విన్న అన్న సర్దిచెప్పాల్సింది పోయి..నువ్వు చనిపోతే ఎలా? అవసరమైతే మీ అత్తనే చంపేద్దామని చెప్పాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి భర్త బాషా మార్కెట్‌యార్డులో డ్యూటీకి వెళ్లగా 10.30 సమయంలో ఇంటికి వచ్చాడు. వాషింగ్‌ మిషన్‌కు ఉన్న వైరును తీసుకుని మంచంపై నిద్రిస్తున్న సర్దార్‌బీ గొంతుకు చుట్టి అన్నా చెల్లెలు తలాఓవైపు లాగి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్నాక వలీ వెళ్లిపోయాడు. అయితే, హత్య తమపైకి రాకూడదని భావించిన సుల్తానా గుర్తు తెలియని దొంగలు చేసినట్లు చిత్రీకరించాలని చూసింది. సర్దార్‌బీ మెడలోని పుస్తెల తాడు, తన మెడలోని బంగారు గొలుసును తెంచుకున్న అనంతరం భర్తకు ఫోన్‌ చేసి గుర్తు తెలియని వ్యక్తులు మీ అమ్మను చంపేశారని, తన మెడలోని బంగారు గొలుసుని కూడా లాక్కెళ్లారని చెప్పింది.

వెంటనే బాషా ఇంటి యజమానికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఆయన కేకలు వేసుకుంటూ రావడంతో కాలనీలో వారంతా నిద్ర లేచారు. ఘటనా స్థలానికి చేరుకుని ఏం జరిగిందని సుల్తానాని ఆరా తీశారు. 100కు ఫోన్‌ చేయడంతో రంగంలోకి దిగిన ఇన్‌చార్జ్‌ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, అనంతపురం రూరల్‌ సీఐ భాస్కర్‌ గౌడ్‌, త్రీటౌన్‌ సీఐ కత్తి శ్రీనివాసులు, నాల్గవ పట్టణ సీఐ జాకీర్‌ హుస్సేన్‌లు హత్యకు దారి తీసిన కారణాలపై ఆరా తీశారు. కోడలు చెబుతున్న ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు సర్దార్‌భీని చంపలేదని నిర్ధారణకు వచ్చారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు కథ బయటపడింది. దీంతో సుల్తానాతో పాటు ఆమె సోదరుడు వలీని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు