2024 ఎన్నికల్లో పుట్టపర్తిపై ఎగిరేది వైఎస్సార్‌ సీపీ జెండానే

2 Apr, 2023 08:27 IST|Sakshi
మాట్లాడుతున్న పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

అనంతపురం: ‘‘పుట్టపర్తి ప్రాంత ప్రజలు మూడు పర్యాయాలు అధికారం ఇస్తే పల్లె రఘునాథరెడ్డి మొద్దు నిద్రలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. నాలుగేళ్ల వైఎస్సార్‌ సీపీ పాలనలో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారు. మందళగిరి మాలోకం లోకేష్‌తో కలసి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికై నా పల్లె రఘునాఽఽథరెడ్డి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. లేకపోతే ప్రజలే రాజకీయ సమాధి కడతారు’’ అని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు.

శనివారం సాయంత్రం ఆయన స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను పుట్టపర్తి నుంచి రోజూ 200 టిప్పర్లతో ఇసుకను బెంగళూరుకు తరలిస్తున్నానని, బెంగళూరు నుంచి లిక్కర్‌ ఇక్కడికి తీసుకువస్తున్నానని, బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నానంటూ ‘యువగళం’లో లోకేష్‌ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని, ఇది అతని దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. నిజంగా లోకేష్‌కు, పల్లె రఘునాథరెడ్డికి దమ్ముంటే నిరూపించాలన్నారు. 12 కేసులుంటేనే టీడీపీ టికెట్‌ అడగాలని లోకేష్‌ బహిరంగ సభలో చెప్పడం అతని రౌడీ సంస్కృతికి నిదర్శనమన్నారు. లోకేష్‌ లాంటివారు యూపీ, బిహార్‌లలో పార్టీలు పెట్టుకుంటే మంచిదని, ఏపీలో ఉండటం మన దౌర్భాగ్యమన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక పుట్టపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు చేయించి ఈ ప్రాంత శాశ్వత అభివృద్ధికి బాటలు వేశామన్నారు. నిజంగా పల్లె రఘునాథ రెడ్డికి ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే.. బాలకృష్ణ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్‌ చేసినప్పుడు ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలన్నారు. నిత్యం అభివృద్ధి మంత్రం జపిస్తున్న ‘పల్లె’ తన వ్యవసాయ కళాశాలను ఇక్కడ కాకుండా బుక్కరాయసముద్రంలో ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పాలన్నారు.

మా పాలన అభివృద్ధికి నిర్వచనం..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా తాము కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. అలాగే అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. అందుకే తమ పాలనను అభివృద్ధికి నిర్వచనంగా జనమే చెప్పుకుంటున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ‘ప్రజాసంకల్ప’యాత్రలో నల్లమాడ బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాంతంలో కరువును శాశ్వతంగా పారదోలేందుకు రూ.864 కోట్లతో 193 చెరువులకు హంద్రీ–నీవా ద్వారా నీటిని నింపే కార్యక్రమానికి పరిపాలనా అనుమతులు తెచ్చామన్నారు. 3 టీఎంసీల నీటిని కూడా అధికారికంగా కేటాయింపులు చేయించామన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల మీదుగా ఎన్‌హెచ్‌–342, గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేలను నిర్మిస్తున్నామని, నియోజకవర్గంలోని నిరుపేదల కోసం 25 వేల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. అభివృద్ధిలో తనతో పోటీ పడలేకే ‘పల్లె’ కుట్రలు, కుతంత్రాలకు తెరతీశారన్నారు. ఆయనకు చేతనైతే అభివృద్ధిలో తమతో పోటీ పడాలని హితవు పలికారు. ఇప్పటికై నా అసత్య ఆరోపణలు మానుకోకపోతే రాబోవు రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారన్నారు.

న్యాయ పోరాటం చేస్తాం..
లోకేష్‌ తనపై చేసిన ఆరోపణలకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వెళ్లేలోపు ఆధారాలు చూపించాలని, లేని పక్షంలో న్యాయపోరాటం చేస్తామని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. పుట్టపర్తి ప్రాంత అభివృద్ధికి, ప్రశాంతతకు తాము ఎప్పటికీ కట్టుబడి ఉంటామన్నారు. ‘పల్లె’ తన రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టే చర్యలకు దిగడం వల్లే వైఎస్సార్‌ సీపీ, టీడీపీ శ్రేణులు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు.

మరిన్ని వార్తలు