అమ్మా.. సీఎం గారే స్వయంగా నన్ను పిలిచి మీ గురించి చెప్పారు...

29 Apr, 2023 11:17 IST|Sakshi

అనంతపురం అర్బన్‌: ‘అమ్మా.. సీఎం గారే స్వయంగా నన్ను పిలిచి మీ గురించి చెప్పారు. సమస్యలు పరిష్కరిస్తాం. ధైర్యంగా ఉండండి’ అని కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి దివ్యాంగురాలు ఆదినారాయణమ్మకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 26న నార్పలకు విచ్చేసిన సందర్భంలో ఆయన్ను యల్లనూరు మండలం దంతెలపల్లికి చెందిన ఆదినారాయణమ్మ కలిశారు. ఈ క్రమంలోనే సీఎం ఆమెకు.. కలెక్టర్‌ను కలవాలని చెప్పడంతో పాటు సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌ గౌతమిని ప్రత్యేకంగా ఆదేశించారు.

దీంతో ఆదినారాయణమ్మ గురువారం తన భర్త రామశివకర్‌రెడ్డితో పాటు కలెక్టరేట్‌కు వచ్చింది. కలెక్టర్‌ స్వయంగా చాంబర్‌ నుంచి కిందికి వచ్చి ఆమెతో మాట్లాడారు. తనకు ఇద్దరు కుమార్తెలని పెద్దమ్మాయి ఇడుపులపాయ ఐఐఐటీలో పనిచేస్తోందని, రెండో అమ్మాయి రాజంపేటలో బీటెక్‌ చేస్తోందని ఆదినారాయణమ్మ చెప్పింది. పెద్దమ్మాయికి ఇక్కడే ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరింది. తాము ఉంటున్న ఇల్లు పడిపోయే స్థితిలో ఉందని కొత్తది మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. తనకు మూడు చక్రాల వాహనం ఇప్పించాలని విన్నవించింది.

కంటికి ఆపరేషన్‌ జరిగినా, నీరు కారుతోందని, కుడికాలు పనిచేయడం లేదని వాపోయింది. ఆమె చెప్పిన సమస్యలను ఆర్‌డీఓ మధుసూదన్‌ నోట్‌ చేసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. మూడు చక్రాల వాహనం తెప్పించి ఇస్తామని చెప్పారు. ఆరోగ్య శ్రీ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డిని పిలిపించి కాలు, కంటికి చికిత్స చేయించాలని ఆదేశించారు. కుమార్తెకు ఏదేని ఉద్యోగం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు